సాక్షి, హైదరాబాద్ : నగరంలో గురువారం ఒక్కరోజే రెండు దారుణ హత్యలు చోటు చేసుకున్నాయి. కుమార్తె మృతికి కారణమైన అల్లుడిని ఓ అత్త దారుణంగా హత్య చేయగా, ప్రేమ విషయమై ఓ యువతి సోదరులు ఓ యువకుడిని హత్య చేశారు. వివరాల్లోకి వెళితే..
పథకం ప్రకారం...
తన కుమార్తె మృతికి కారణమైన అల్లుడిపై కక్ష పెంచుకున్న అత్త పథకం ప్రకారం అతడిని హత్య చేసి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ రంగస్వామి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మీర్‌పేటలో ఉంటున్న అనిత, బాబురావు దంపతులకు ముగ్గురు సంతానం. 10 ఏళ్ల క్రితం బాబూరావు వదిలేసి వెళ్లిపోవడంతో అనిత మీర్‌పేటలో ఉంటూ క్యాటరింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు చెందిన పాలెం నవీన్ కుమార్‌తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. తరచు వారి ఇంటికి వచ్చివెళ్లే నవీన్ కన్ను అనిత చిన్న కూతురు వందన(19)పై పడింది. దీంతో అతను అనితను ఒప్పించి నవంబర్– 2019లో ఆమెను వివాహం చేసుకున్నాడు. అయినా వీరి సంబంధం కొనసాగుతుండటంతో మనస్తాపానికి లోనైన వందన సూసైడ్‌నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మీర్‌పేట్ పోలీసులు ఆమె తల్లి అనిత, భర్త ననీన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌పై బయటకు వచ్చిన అనంతరం చెరో దారి పట్టారు. అనిత పార్శిగుట్టలో ఉండగా, నవీన్ రామంతాపూర్‌లోని శ్రీనగర్ కాలనీలో ఉంటున్నాడు. కాగా నవీన్ అనిత అడ్రస్ తెలుసుకున్న బుధవారం రాత్రి ఆమెను రామంతాపూర్‌లోని తన ఇంటికి పిలిపించుకున్నాడు. తన కుమార్తె మరణానికి, జైల్‌కు వెళ్లడం, కుటుంబానికి దూరం కావడంతో అనిత నవీన్‌పై కక్ష పెంచుకుంది. కాగా బుధవారం రాత్రి ఆత్మహత్య కేసు నుంచి తనను తప్పించాల్సిందిగా, రాజీ కుదుర్చుకునే వీలుగా మాట్లాడాలని అనితను కోరాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
తెల్లవారుజామున నవీన్ నిద్ర పోతుండగా కిచెన్‌లో ఉన్న కత్తి తీసుకువచ్చిన అనిత అతడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హతమార్చింది. నవీన్ చనిపోయాడని నిర్ధారించుకున్న అనంతరం నేరుగా ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. దీంతో ఇన్‌స్పెక్టర్ రంగస్వామి సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అన్న ప్రాణం తీసిన తమ్ముడి ప్రేమ
అబిడ్స్: తమ్ముడి ప్రేమ వ్యవహారంలో అతని అన్న దారుణ హత్యకు గురైన సంఘటన షాహినాయత్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ చాంద్‌పాషా కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పురానాపూల్ చంద్రకిరణ్ బస్తీకి చెందిన తారయ్యకు ఇద్దరు కుమారులు మధు(22), అరవింద్(17) ఉన్నారు. జూలాయిగా తిరుగుతున్న మధు ఆరు నెలల క్రితం ఓ దొంగతనం కేసులో అరెస్టై జైలుకు వెళ్లివచ్చాడు. అయితే అదే బస్తీలో ఉంటున్న తన సమీప బంధువు ప్రకాష్ కుమార్తెను మధు తమ్ముడు అరవింద్ ప్రేమిస్తున్నాడు. ఈ విషయం ప్రకాష్ కుటుంబ సభ్యులకు తెలియడంతో బుధవారం అతను తన సోదరులతో కలిసి మధు ఇంటికి వెళ్లి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. అయితే అరవింద్ వారి మాటలు లెక్క చేయకపోగా నీ కుమార్తెను ప్రేమిస్తానని తేల్చి చెప్పాడు. దీంతో ఆగ్రహానికి లోనైన ప్రకాష్ అతని సోదరులు ఇద్దరు అరవింద్‌ను హత్య చేయాలని పథకం పన్నారు.
బుధవారం అర్ధరాత్రి ముగ్గురు అరవింద్ ఇంటికి వెళ్లి బయటికి రావాలని తలుపులు బద్దలు కొట్టారు. అరవింద్ బయటికి రావడంతో ముగ్గురు కలిసి అతడిపై మారణాయుధాలతో దాడిచేశారు. అక్కడికి వచ్చిన మధు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా వారు ముగ్గురు మధుపై దాడికి దిగారు. ఇదే అదనుగా అరవింద్ ఇంటి వెనక ఉన్న బాల్కానీపై నుంచి దూకి పారిపోయాడు. మధు కూడా తప్పించుకునే ప్రయత్నం చేయగా ముగ్గురు అతడిపై కత్తి, రాడ్లతో దాడి చేయడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలాడు. కాగా నిందితులు ముగ్గురు నేరుగా స్టేషన్‌కు వెళ్లి మధు, తన తమ్ముడు అరవింద్ తమపై దాడిచేశారని ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మధు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment