
సాక్షి, హైదరాబాద్: పిస్తోలుతో బెదిరించి ఇద్దరు ఆగంతకులు ఓ మనీ ట్రాన్స్‌ఫర్ వ్యాపారి నుంచి రూ.1.95 లక్షలు దోచుకెళ్లిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జీడిమెట్ల సీఐ బాలరాజు తెలిపిన వివరాల మేరకు..కుత్బుల్లాపూర్ భాగ్యలక్ష్మి కాలనీకి చెందిన రవికుమార్ మూడు సంవత్సరాలుగా అయోధ్యనగర్ చౌరస్తాలో ‘లక్ష్మి మనీ ట్రాన్స్‌ఫర్’ పేరిట వ్యాపారం నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో రవికుమార్ దుకాణం మూసేందుకు సిద్ధమై ఆరోజు వచ్చిన మొత్తం రూ.1.95 లక్షలు బ్యాగులో పెట్టుకున్నాడు.
ఇంతలో షాపులోకి హెల్మెట్, మాస్కులు ధరించిన ఇద్దరు యువకులు చొరబడి తుపాకీ చూపించి..అరిస్తే చంపేస్తామంటూ బెదిరించారు. భయపడిన రవికుమార్ మాట్లాడకుండా ఉండిపోయాడు. అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తో పాటు బ్యాగులో ఉన్న డబ్బును తీసుకుని ఉడాయించారు. దీంతో రవికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో పోలీసులకు సెల్‌ఫోన్ లభించింది. ఇద్దరు యువకులు నెంబర్ ప్లేట్‌లేని తెల్లరంగు హోండా యాక్టివాపై వచ్చినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. పోలీసులు దొంగల వేలిముద్రలతో పాటు సీసీ పుటేజీని స్వాధీనం చేసుకున్నారు.
ఇది తెలిసినవారి పనేనా?
ఇది తెలిసిన వారి పనేనా..? లేక కొత్త వ్యక్తులు ఎవరైనా దొంగతనానికి పాల్పడ్డారా.. అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాల సహాయంతో త్వరలోనే దొంగలను పట్టుకుంటామని సీఐ తెలిపారు.
( చదవండి: బావ గొంతుకోసిన బావమరిది: అందుకే చంపేశానంటూ )
Comments
Please login to add a commentAdd a comment