మిన్నంటిన తల్లిదండ్రుల రోదనలు
స్వగ్రామంలో విహాన్ అంత్యక్రియలు
మిరుదొడ్డి/జవహర్‌నగర్: గోరంత ముల్లు గుచ్చు కుంటేనే తల్లడిల్లే ప్రాణంరా నీది.. గుంపులుగా వచ్చిన కుక్కలు గాట్లు పడేలా కొరుకుతూ, ఈడ్చుకెళుతుంటే ఎంత తల్లడిల్లినవో కొడుకా అంటూ ఆ చిన్నారి తల్లిదండ్రులు రోదించిన తీరు కంటతడిపెట్టించాయి.
మల్కాజిగిరి– మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లోని ఆదర్శనగర్‌లో కుక్కల దాడిలో విహాన్ మృతి చెందడం యావత్ రాష్ట్రాన్నే కుది పేసింది. విహాన్ మృతదేహం బుధవారం ఉదయం స్వగ్రా మమైన మిరుదొడ్డికి చేరుకుంది. నిలువెల్లా గాయాలతో నిండిపోయిన చిన్నారి మృతదేహాన్ని చూసిన బంధువులు, గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి. మధ్యాహ్నం తర్వాత విహాన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి.
బతుకుదెరువుకు వలసొచ్చి.. కొడుకును కోల్పోయి
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డికి చెందిన పుల్లూరి భరత్‌కుమార్–వెంకటలక్ష్మి దంపతులకు ఎనిమిదేళ్లలోపు ఇద్దరు కూతుళ్లు సాహితి, శృతి, కుమారుడు విహాన్ ఉన్నారు. గ్రామంలో కార్పెంటర్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. నెలరోజుక్రితం బతుకుదెరువుకు జవహర్‌నగర్‌కు వలసవచ్చారు. స్థానికంగా ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి విహాన్ బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని ఆరు బయటకు వెళ్లాడు. అక్కడే వేచి ఉన్న వీధికుక్కలు విహాన్ వెంటపడి విచక్షణారహితంగా దాడిచేసి కొరికాయి. కుక్కలదాడిలో విహాన్ బలికావడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
అఖిలపక్ష నేతల నిరసన
జవహర్‌నగర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట అఖిలపక్ష నాయకులు, ప్రజా సంఘాల నేతలతో కలిసి ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. విహాన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని కాంగ్రెస్ పార్టీ అధ్య క్షుడు శ్రీకాంత్ యాదవ్, మేయర్ శాంతి, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్‌లు అన్నారు. తక్షణ సహాయంగా రూ. 50వేలు అందిస్తున్నా మన్నారు. బాలుడి కుటుంబానికి మున్సిపల్ కార్యాల యంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగంతో పాటు ఇంటిస్థలం అందించేందుకు కృషి చేస్తామని హమీ ఇచ్చారు.
కదిలిన మున్సిపల్ యంత్రాంగం
వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందడంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీంతో మున్సిపల్ అధికారులు ప్రధాన రహదారుల్లో ఉన్న వీధి కుక్కలను పట్టుకొని వ్యాన్‌లో ఎక్కించి బయటకు తీసుకెళ్లారు.
విహాన్ కుటుంబాన్ని ఆదుకోవాలి: ఎంపీ ఈటల
విహాన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. బుధవారం మేడ్చల్ కలెక్టర్‌తోపాటు జవహర్‌నగర్ మున్సి పల్ కమిషనర్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకు న్నారు. గురువారం ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలిస్తానని చెప్పారు.
కలెక్టర్‌కు నివేదించాం: కమిషనర్ తాజ్‌మోహన్‌రెడ్డి
వీధికుక్కల దాడి ఘటనపై పూర్తి వివరాలతో మేడ్చల్ కలెక్టర్‌కు నివేదిక అందించామని జవహర్‌నగర్ కమిషనర్ తాజ్‌మోహన్ రెడ్డి తెలిపారు. బాధిత కుటుంబానికి తక్షణ సహాయం కింద రూ.50 వేలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment