
కూడేరు: పంటకు కాపలాగా వెళ్లి శ్రీకాంత్ (24) అనే గ్రామ వలంటీర్ దారుణ హత్యకు గురైన ఘటన అనంతపురం జిల్లా కూడేరు మండలం శివరామ్‌పేటలో శనివారం వేకువజామున చోటుచేసుకుంది. శివరామ్‌పేటకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు వెంకటేష్ తన పొలంలో నూర్పిడి చేసిన వేరుశనగ పంటకు రెండు రోజులుగా రాత్రి వేళ కాపలా కాస్తున్నాడు. శుక్రవారం రాత్రి అతడు పొలం నుంచి ఇంటికి భోజనానికి రాగా.. అతని కుమారుడు వలంటీర్ శ్రీకాంత్ పంట కాపలా నిమిత్తం పొలానికి వెళ్లాడు. అతనితోపాటు స్నేహితులైన రాజు, మల్లికార్జున కూడా పొలానికి వెళ్లి రాత్రి 12.45 గంటల సమయంలో ఇళ్లకు వెళ్లిపోయారు.
శనివారం ఉదయాన్నే శ్రీకాంత్ చిన్నాన్న పొలంలోకి వెళ్లగా శ్రీకాంత్ తీవ్ర గాయాల పాలై అచేతన స్థితిలో కనిపించాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని శ్రీకాంత్‌ను కూడేరు పీహెచ్‌సీకి, అక్కడినుంచి అనంతపురం ప్రభుత్వాస్పతికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే శ్రీకాంత్ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ వీరరాఘవరెడ్డి, సీఐ కృష్ణారెడ్డి, ఎస్‌ఐ యువరాజు, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం పరిశీలించాయి. ఒక్కగానొక్క కుమారుడిని అతి దారుణంగా చంపేశారని తల్లిదండ్రులు భోరున విలపించారు.
వలంటీర్‌గా ఎంతో నిజాయతీతో సేవలందించాడని.. ఎవరితోనూ గొడవలు లేవని తండ్రి వెంకటేష్ తెలిపారు. అనంతపురం, హిందూపురం ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు అనంతపురంలోని సర్వజన ఆస్పత్రికి వెళ్లి శ్రీకాంత్ మృతదేహాన్ని పరిశీలించారు. సమగ్ర విచారణ జరిపి హంతకులను పట్టుకుని శిక్షించాలని పోలీసులను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment