సాక్షి, మేళ్లచెరువు : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ మహిళ దారుణానికి తెగబడింది. మద్యం సేవించి నిద్రమత్తులో ఉన్న భర్త తలను గోడకు బలంగా మోది కడతేర్చింది. ఈ దారుణ ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల పరిధిలోని కప్పలకుంట తండాలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. సీఐ శివరాంరెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కప్పలకుంటతండాకు చెందిన భూక్యా బాలాజీ (40)కి కోదాడ మండలం బాలజీనగర్ తండాకు చెందిన బుజ్జీతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సంతానం. బాలాజీ కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
భర్త దుబాయ్ బాట.. భార్య అడ్డదారి
బాలాజీకి స్థానికంగా కూలి పనులు దొరక్కపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో తెలిసిన వారి సహకారంతో నాలుగేళ్ల క్రితం దుబాయ్‌కి వెళ్లాడు. అక్కడినుంచి ప్రతి నెలా డబ్బులు పంపిస్తుండడంతో బుజ్జి పిల్లలను పోషించుకుంటోంది. అయితే ఇదే సమయంలో బుజ్జి గ్రామానికి చెందిన రాముడుతో వివాహేతర సంబంధం పెట్టుకుని అడ్డదారులు తొక్కింది. బాలాజీ అక్కడి నుంచి బాగా డబ్బులు సంపాందించి రెండేళ్ల క్రితం తన ఇద్దరు కూతుళ్ల వివాహాలు జరిపించాడు. కుమారుడు ప్రస్తుతం స్థానిక ఓ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు.
చదవండి: (తల్లితో సహజీవనం.. కుమార్తెపై ఘాతుకం)
నాలుగు నెలల క్రితం తిరిగి రాగా..
బాలాజీ నాలుగు నెలల క్రితం స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అతడికి భార్య ప్రవర్తనపై అనుమానం కలిగింది. పలుమార్లు ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయినా బుజ్జి తగ్గకుండా ప్రతిసారి ఇబ్బందులకు గురిచేయడంతో పాటు చిత్రహింసలు పెట్టింది. భార్య ప్రవర్తనకు విసిగి వేసారిన బాలాజీ తాగుడుకు బానిసగా మారాడు.
ఒక్కతే తెగబడిందా.. ప్రియుడు సహకరించాడా..?
ఎప్పటిలాగే శనివారం రాత్రి కూడా బాలాజీ మద్యం తాగి ఇంటికి వచ్చాడు. రోజూ మాదిరిగానే దంపతులు గొడవపడుతుండగా కుమారుడు పక్క గదిలో నిద్రపోయాడు. తెల్లారేసరికి బాలాజీ విగత జీవిగా మారడంతో ఇరుగుపొరుగు వారు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ శివరాంరెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. అయితే బుజ్జి మాత్రం తానే భర్త తలను గోడకు బలంగా మోది హత్య చేశానని తెలిపిందని సీఐ తెలిపారు. కాగా, బుజ్జి ఒక్కతే ఘాతుకానికి తెగబడిందా లేక ఇందులో ప్రియుడి హస్తం కూడా ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాగా, పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని సీఐ ధ్రువీకరించలేదు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం బాలాజీ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు నెహ్రూ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
చదవండి: (సీమంతానికి ఏర్పాట్లు చేస్తుండగానే గర్భిణి ఆత్మహత్య)
Comments
Please login to add a commentAdd a comment