కాకినాడ లీగల్: పథకం ప్రకారం భర్తను హత్య చేసిన కేసులో భార్యకు, ఆమె ప్రియుడికి జీవిత ఖైదు, రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ కాకినాడ నాలుగో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి పి.కమలాదేవి శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. కాకినాడ జిల్లా కరప మండలం పేపకాయలపాలేనికి చెందిన పేకేటి నాగలక్ష్మికి అదే గ్రామానికి చెందిన వివాహితుడు కర్రి రాధాకృష్ణతో రెండేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఆమెకు పెద్దలు పెళ్లి కుదిర్చారు.
ఆమెకు ఇష్టం లేకపోయినా 2019 మే 15 తేదీన పేకేటి సూర్యనారాయణ అనే వ్యక్తితో వివాహం చేశారు. వివాహం జరిగిన వారం రోజుల్లోనే సూర్యనారాయణను హతమార్చేందుకు భార్య నాగలక్ష్మి, ఆమె ప్రియుడు రాధాకృష్ణ పథకం వేశారు. ఇందులో భాగంగా 2019 మే 21వ తేదీన సూర్యనారాయణకు రాధాకృష్ణ ఫోన్ చేశాడు. సరదాగా బయటకు వెళదామంటూ పెనుగుదురు వద్దకు రమ్మన్నాడు. అక్కడి నుంచి పాతర్లగడ్డ మార్గంలోని çపంట పొలాల్లోకి తీసుకువెళ్లాడు.
అక్కడ సూర్యనారాయణను కూర్చోబెట్టి వెంట తెచ్చుకున్న కత్తితో నరికి హత్య చేశాడు. హతుడి సోదరుడు సత్తిబాబు ఫిర్యాదు మేరకు అప్పటి కరప ఎస్సై జి.అప్పలరాజు ఈ హత్యపై కేసు నమోదు చేశారు. నాటి కాకినాడ రూరల్ సీఐ పి.ఈశ్వరుడు ఈ కేసు దర్యాప్తు చేశారు. కోర్టు విచారణలో నాగలక్ష్మి, రాధాకృష్ణలపై నేరం రుజువైంది.
దీంతో హత్య చేసినందుకు గాను ఒక్కొక్కరికి జీవిత ఖైదు, రూ.5 వేల జరిమానా, సాక్ష్యాన్ని తారుమారు చేసినందుకు గాను ఒక్కొక్కరికి మూడేళ్ల జైలు, రూ.5 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. రెండు శిక్షలూ ఏకకాలంలో అమలు చేయాలని ఆదేశించారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వై.ప్రశాంతి కుమారి ప్రాసిక్యూషన్ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment