
బాధితుడు నంజేగౌడ
దొడ్డబళ్లాపురం/కర్ణాటక: ఎమర్జెన్సీ అంటూ లిఫ్ట్ అడిగిన ఒక మహిళ సదరు వ్యక్తిని స్నేహితులతో కలిసి దోపిడీ చేసిన సంఘటన దొడ్డ తాలూకాలో వెలుగు చూసింది. తాలూకాలోని వడ్డరహళ్లికి చెందిన నంజేగౌడ (51) దోపిడీకి గురైన బాధితుడు. ఎం స్యాండ్ వ్యాపారం చేసే నంజేగౌడ ఎల్లప్పుడూ మెడలో బంగారు గొలుసులు వేసుకుని ఉంటాడు. తరచూ దొడ్డ పట్టణానికి వచ్చి స్వగ్రామానికి తిరిగి వెళ్తుంటాడు. ఈ క్రమంలో ఈనెల 26న నంజేగౌడ పట్టణంలోని ఏపీఎంసీ మార్కెట్ నుండి బైక్‌పై బయలుదేరాడు. అదే సమయంలో నంజేగౌడ బైక్‌ను ఆపిన లక్ష్మి అనే మహిళ స్నేహితురాలి డెలివరీకి అర్జెంటుగా డబ్బులు ఇవ్వాలని, డ్రాప్ చేయాలని అడిగింది.
ఘాటి రోడ్డులో తనను దింపాలని లక్ష్మి అడగడంతో నంజేగౌడ ఆమెను నమ్మి తీసుకెళ్లాడు. అయితే మార్గం మధ్యలో అనుమానం వచ్చి ప్రశ్నించాడు. అంతలో వెనుకనే మరో బైక్‌పై అనుసరించి వచ్చిన రాజేశ్, మణికంఠ నంజేగౌడపై దాడి చేసి బంగారు గొలుసులు లాక్కున్నారు. నంజేగౌడ కేకలు వేయడంతో స్థానికులు వచ్చి మణికంఠను పట్టుకున్నారు. లక్ష్మి, రాజేశ్ బంగారు గొలుసులతో పరారయ్యారు. మణికంఠను అదుపులోకి తీసుకున్న దొడ్డ గ్రామీణ పోలీసులు పరారైన లక్ష్మి, రాజీవ్‌ను కూడా అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment