శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని పెదపాడు వీరన్న షెడ్డు పరిసర ప్రాంతంలో రిటైర్డ్ వైద్యుని ఇంట్లో సోమవారం అర్ధరాత్రి ఓ మహిళ దారుణహత్యకు గురైంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళంలో వైద్యునిగా పనిచేసిన డాక్టర్ గొల్లంగి జగన్నాథం ఇంట్లో సుమారు పాతికేళ్లుగా ఇద్దరు మహిళలు తాళ్లవలస రాజు(35), చిట్టెమ్మ పనిమనుషులుగా ఉంటున్నారు.
వీరిలో రాజు చిన్నప్పటి నుంచి వైద్యుని ఇంటిలోనే ఉంటోంది. వివాహం కాలేదు. మరో మహిళ చిట్టెమ్మ స్వస్థలం ఎచ్చెర్ల మండలం పొన్నాడ. ఈమెకు వివాహమైంది. జగన్నాథం కుటుంబమంతా ప్రస్తుతం విశాఖపట్నంలోనే నివాసం ఉంటున్నారు. ఈయన కుమారుడు కూడా డాక్టర్ కావడంతో శ్రీకాకుళంలోని ఓ నర్సింగ్ హోంలో ఆర్థోపెడిక్ సర్జన్‌గా సేవలందించేందుకు వారానికి ఒకసారి వచ్చి ఓపీ చూసి వెళ్తుంటారు. ఆ సమయంలో వంట చేసేందుకు, ఇంటిని చూసుకునేందుకు రాజు, చిట్టెమ్మలు నమ్మకంగా పనిచేస్తున్నారు.
ఏం జరిగిందంటే..
పనిమనుషుల్లో ఒకరైన రాజు శ్రీకాకుళం నగరంలోని ఇలిసిపురంలో బంధువుల ఇంటికి ఆదివారం వెళ్లి తిరిగి సోమవారం సాయంత్రానికి వచ్చేసింది. అదే రోజు రాత్రి ఏమైందో గానీ తలపై బలమైన గాయాలతో హత్యకు గురైంది. ఈ విషయాన్ని మరో పనిమనిషి చిట్టెమ్మ వైద్యుని ఇంటి పక్కనే ఉన్న షాపు యజమానులకు మంగళవారం ఉదయం చెప్పింది. వారు విశాఖలోని జగన్నాథంకు ఫోన్‌లో విషయం చేరవేశారు. ఆయన శ్రీకాకుళం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన క్లూస్‌టీం సబ్యులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రక్తపు మరకలతో నైటీ, నిరోధ్ ప్యాకెట్లు గుర్తించినట్లు తెలిసింది. హత్య జరిగిన ప్రదేశాన్ని శ్రీకాకుళం డీఎస్పీ వై.శృతి పరిశీలించారు. టౌన్ సీఐ సన్యాసినాయుడు, రూరల్ ఎస్‌ఐ విజయ్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment