నిందితులను అరెస్టు చూపుతూ వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ వినోద్‌కుమార్
సాక్షి, కర్నూలు(పెద్దకడబూరు): మండల పరిధిలోని హెచ్.మురవణి గ్రామ పరిధిలోని ఎల్‌ఎల్‌సీలో దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళ కేసు కొత్త మలుపు తిరిగింది. మహిళది ఆత్మహత్య కాదని, సొంత వాళ్లే హత్య చేసి కాలువలో పడేశారని విచారణలో తేలింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ ఎదుట ప్రవేశపెట్టారు. ఆ వివరాలను డీఎస్పీ విలేకరులకు వెల్లడించారు. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన వీరారెడ్డి భార్య ప్రభావతి (38) స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయాన్ని పసిగట్టిన వీరారెడ్డి.. భార్యను మందలించాడు. అయినా ప్రవర్తన మార్చుకోకపోవడంతో అత్త వెంకటేశ్వరమ్మ(ప్రభావతి తల్లి), సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి గత నెల 31న ఇంట్లోనే చితకబాదారు. (విచక్షణ కోల్పోయి: భార్య, కుమారుడిపై...)
స్పృహ తప్పి పడిపోవడంతో చనిపోయిందని భావించి కారులో తీసుకెళ్లి ఎల్‌ఎల్‌సీలో పడేసి అక్కడి నుంచి జారుకున్నారు. కొనఊపిరితో ఉన్న ఆమెను చుట్టపక్కల పొలాల రైతులు గమనించి బయటకు తీయగా కొద్దిసేపటికే మృతిచెందింది. అయితే వివాహేతర సంబంధం తెలిసి మందలించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తలపై రక్త గాయాలు ఉన్నందున అనుమానంతో ఆ దిశగా విచారణ చేపట్టగా హత్య కేసు వెలుగు చూసింది. తాము దొరికిపోతామని భావించిన నిందితులు గురువారం హెచ్.మురవణి వీఆర్‌ఓ సురేష్ ఎదుట హాజరై నేరం చేసినట్లు అంగీకరించడంతో ఆయన ఫిర్యాదు మేరకు హత్య కేసుగా మార్పు చేశారు. నిందితులను అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment