కొవ్వూరు: డ్వాకా రుణ వాయిదా చెల్లింపు విషయంపై తగదా పడి భార్యను భర్త చెంపపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మంగళవారం కొవ్వూరు మండలం మద్దూరు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సండ్ర వీరబాబు, భార్య లావణ్య సాయి దీపిక(30)తో డ్వాక్రాలో తీసుకున్న రుణం చెల్లింపు విషయంపై వారం నుంచి తగదా పడుతున్నాడు.
మంగళవారం ఉదయం వాయిదా డబ్బులు ఇవ్వాలని భార్య మరోసారి అడగడంతో కోపోద్రిక్తుడైన వీరబాబు ఆమెను చెంపపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే పడి మృతి చెందినట్లు స్ధానికులు చెబుతున్నారు. ఈ విషయం వీరబాబు అత్తమామలకు ఫోన్ చేసి జరిగిన ఘటనకు గురించి తెలిపాడు. వీరబాబుకి, లావణ్యకి 13 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు వీరబాబే లావణ్యను హత్య చేశాడని ఆరోపించారు.
పెళ్లి అయినప్పటి నుంచి వీరబాబు తన కుమార్తెను సక్రమంగా చూసుకోలేదని, ఎన్నో బాధలు పెట్టారని తల్లి బడేటి వెంకటలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెను చిత్ర హింసలకు గురి చేయడమే కాకుండా అన్యాయంగా చంపేశారని ఆరోపించారు. వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై కె.సుధాకర్ తెలిపారు. డీఎస్పీ కె.సీహెచ్ రామరావు ఘటనా స్ధలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment