ఈతకోట వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జ్యోతికుమారి
సాక్షి, రావులపాలెం: పండగకు కొత్త వస్త్రాలు తెస్తారని ఎదురుచూస్తున్న పిల్లలకు.. అమ్మ రాదనే విషయాన్ని ఎలా చెప్పాలి.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిందని ఎలా వివరించాలని భార్య మృతదేహం వద్ద భర్త విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.. సంక్రాంతి పండగకు కొత్త దుస్తులు తీసుకొస్తామని పిల్లలకు చెప్పి ఇంటి నుంచి వెళ్లిన దంపతులు రోడ్డు ప్రమాదానికి గురైన వార్త ఆ ఇంట విషాదాన్ని నింపింది. ప్రమాదంలో భార్య మృత్యువాత పడగా, భర్త గాయాలతో ఆస్పత్రి పాలవడం అందరినీ కలచివేసింది. రావులపాలెం మండలం ఈతకోట జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. చదవండి: ‘చోర్ సింగర్’.. సిటీలోనూ వాంటెడ్ !!
పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం చివటం గ్రామానికి చెందిన అద్దంకి విజయ్‌కుమార్, జ్యోతికుమారి దంపతులు. వారు పిల్లలకు కొత్త దుస్తులు కొందామని మోటార్ సైకిల్‌పై రావులపాలేనికి వచ్చారు. చిన్నారులైన కొడుకు, కూతుర్లకు సరిపోయే అందమైన దుస్తులు వారికి దొరక్కపోవడంతో తణుకులో కొనుగోలు చేద్దామని సాయంత్రం రావులపాలెం నుంచి తిరుగు పయనమయ్యారు. మార్గ మధ్యంలో ఈతకోట వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వచ్చిన లారీ వారి మోటారు సైకిల్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిందపడి పోయిన జ్యోతికుమారి (32)కి తలకు గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. స్వల్ప గాయాలపాలైన విజయ్‌కుమార్‌ను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్టు ఎస్సై పి.బుజ్జిబాబు తెలిపారు.
పిల్లలకు ఎలా చెప్పేది...
పండగకు అమ్మ కొత్త వస్త్రాలు తీసుకొస్తుందని ఇంటి వద్ద ఎదురుచూస్తున్న పిల్లలకు నేనేమి చెప్పాలంటూ భర్త విజయ్‌కుమార్ సంఘటనా ప్రాంతంలో విలపించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. కొత్త దుస్తులతో పండగ చేసుకుందామని వచ్చి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయావా... నేను పిల్లలను ఎలా పెంచాలి.. వారి ఆలనా పాలనా ఎవరు చూస్తారంటూ ఆయన ఆవేదన చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment