వివరాలు సేకరిస్తున్న పోలీసులు
పెద్దపల్లి: వారిద్దరూ అక్కాచెల్లెళ్లు. ఒకరు శ్వేత, మరొకరు స్వాతి. గతంలోనే తల్లితోపాటు నాయనమ్మ కూడా మృతిచెందారు. వీరిద్దరిని వదిలి తండ్రి ఎక్కడికో వెళ్లిపోయాడు. కొద్దిరోజులుగా శ్వేత కనిపించట్లేదు. ఇదే విషయాన్ని స్థానికులు స్వాతిని ఆరా తీస్తే సమాధానం చెప్పలేదు.
సోమవారం సాయంత్రం వీరి ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించగా శ్వేత శవమై కుళ్లిపోయినస్థితిలో ఉండగా.. అక్క స్వాతి ఆ శవం వద్దే కూర్చుని ఉంది. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగింది.
రేషన్ బియ్యం తెచ్చుకొని తింటూ..
జిల్లా కేంద్రంలోని ప్రగతినగర్‌కు చెందిన దంపతులకు ఇద్దరు కూతుళ్లు స్వాతి, శ్వేత. 2016లో వీరి తల్లితో పాటు నాయనమ్మ చనిపోయారు. తల్లి చనిపోయినప్పుడు పిల్లలు సుమారు రెండురోజుల పాటు శవంతోనే ఉన్నట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు.
ఆమె శవాన్ని ఇంట్లోనే ఖననం చేసినట్లు అప్పట్లో చర్చనీయాంశమైంది. అదే సమయంలో తండ్రి వీరిని వదిలి వెళ్లిపోయాడు. ప్రగతినగర్ పెద్దపల్లికి శివారులో ఉండడంతో వీరు ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవారుకాదు. పైగా ఇద్దరికీ మానసిక పరిస్థితి సరిగా ఉండేదికాదు. రేషన్ బియ్యం తెచ్చుకుని తింటూ ఇంట్లోనే ఉండేవారు.
శ్వేత శవంతోనే 4 రోజులుగా..
శ్వేత కొద్దిరోజులుగా కనిపించకపోవడంతో స్థానికులు స్వాతిని ఆరా తీశారు. అయినా ఆమె బదులు చెప్పలేదు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూడగా శ్వేత (24) శవం కుళ్లిపోయి ఉంది. ఆమె 4 రోజుల క్రితమే చనిపోయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అంత దుర్వాసనలోనూ స్వాతి ఎలా ఉందోనని స్థానికులు చర్చించుకుంటున్నారు.
ఎస్సైలు రాజేశ్, రాజవర్ధన్ ఆధ్వర్యంలో శ్వేత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ఆస్పత్రికి తరలించారు. స్వాతి వద్ద డబ్బులు లేకపోవడంతో పోలీసులే దహన సంస్కారాలు పూర్తిచేయించారు. స్వాతి మానసిక స్థితి సరిగా లేదని ఎస్సై తెలిపారు. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment