హతురాలు పద్మజ (ఫైల్)
కోనేరుసెంటర్(మచిలీపట్నం): బందరులో అదృశ్యమైన మహిళ తెలంగాణలో హత్యకు గురైంది. గుర్తుతెలియని దుండగులు ఆమెను కిడ్నాప్ చేసి పథకం ప్రకారం హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బాధితురాలి అదృశ్యంపై కేసు నమోదు చేసిన ఇనగుదురుపేట పోలీసులు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు. కూరగాయల వ్యాపారం చేసుకునే మచిలీపట్నం సర్కిల్‌పేటకు చెందిన పల్లపోతు పద్మజ (45) గత నెల 31వ తేదీ తెల్లవారుజామున వ్యాపారం నిమిత్తం ఇంటి నుంచి బయటికి వెళ్లిన విషయం పాఠకులకు విదితమే. అలా బయటికి వెళ్లిన ఆమె ఆ రోజు తిరిగి ఇంటికి చేర లేదు.
అనుమానం వచ్చిన ఆమె భర్త ఈనెల ఒకటో తేదీన పద్మజ అదృశ్యంపై ఇనగుదురుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా ఈ నెల 1వ తేదీన తెలంగాణలోని నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతంలో గుర్తుతెలియని మహిళను దుండగులు హత్య చేసి తగులబెట్టిన ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో సదరు మహిళ మృతదేహం పద్మజదిగా నార్కట్‌పల్లి పోలీసులు గుర్తించారు. విషయాన్ని ఇనగుదురుపేట పోలీసులకు తెలిపారు.
పద్మజ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన ఇనగుదురుపేట పోలీసులు నార్కట్‌పల్లి పోలీసులు తెలిపిన ఆధారాల ప్రకారం మృతదేహం పద్మజదిగా గుర్తించారు. పద్మజ హత్యకు గురికావడంతో రంగంలోకి దిగిన ఇనగుదరుపేట పోలీసులు కిడ్నాప్ కేసుగా పరిగణనలోకి తీసుకుని అనుమానితులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు సమాచారం. పద్మజ హత్య పథకం ప్రకారమే జరిగినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమెను దగ్గరి బంధువులు, ఆమెతో సన్నిహితంగా మెలిగిన వారే హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. బందరు డీయస్పీ మహబూబ్‌బాషా, ఇనగుదురుపేట సీఐ శ్రీనివాస్ కేసు దర్యాప్తులో భాగంగా మరిన్ని వివరాలు సేకరించే నిమిత్తం శుక్రవారం నార్కెట్ పల్లి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment