తిరుపతి
చందుర్తి(వేములవాడ):చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన బైరగోని తిరుపతి(30)ని ఆదివారం గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. నర్సింగాపూర్‌కు చెందిన తిరుపతి కల్లు మండువలో ముగ్గురు వ్యక్తులకు కల్లు విక్రయించాడు. కల్లు పోస్తుండగా సేవించిన వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టారా? భూ వివాదమే హత్యకు దారి తీసిందా తెలియాల్సి ఉంది. కల్లు సేవించేందుకు వచ్చి ముగ్గురు ఏ గ్రామానికి చెందినవారో గుర్తిస్తే అసలు విషయాలు బయటపడుతాయని పోలీసులు భావిస్తున్నారు. ఘటన స్థలంలో పల్సర్‌బైక్‌తో పాటు హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. బైక్‌కు నంబర్ లేకపోవడంతో చాయిస్‌నంబర్ ఆధారంగా వివరాలు సేకరించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
భూ వివాదమే కారణమా..?
చందుర్తి మండలం మూడపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ భూమి కోసం అక్కాచెల్లెళ్ల కుమారుల మధ్య వివాదం ఉన్నట్లు సమాచారం. అమ్మమ్మకు చెందిన భూమి తమకే దక్కాలంటూ అక్కాచెల్లెళ్ల కొడుకులు కోర్టు వరకు వెళ్లినట్లు తెలిసింది. ఇటీవలే తిరుపతికి కోర్టు జడ్జిమెంట్ అనుకూలంగా రాగా, దీనిని దృష్టిలో పెట్టుకొని బంధువులే హత్యకు పాల్పడ్డరా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటన స్థలానికి డాగ్‌స్క్వాడ్ వచ్చినా వర్షం పడడంతో ప్రయోజనం లేకుండాపోయింది.
గుండెలవిసేలా రోదిస్తున్న కుటుంబ సభ్యులు..
బైరగోని పెద్దమల్లయ్య– రాజవ్వ దంపతులకు నలుగురు సంతానం కాగా ముగ్గురు కూతుళ్లు. తిరుపతి చిన్నవాడు కావడంతో కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ‘భూమి కోసం పాణం తీసిండా కొడుకా’ అంటూ తల్లి రోదించిన తీరు అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది. మృతుడికి భార్య సహస్ర, నెల రోజుల వయస్సు గల పాప ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment