
హైదరాబాద్ : సహజీవనం చేస్తున్న వ్యక్తి వేధింపులు భరించలేక ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా బోట్లవనపర్తికి చెందిన పల్లవి (27) నగరంలో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తుంది. కొన్నేళ్ల క్రితం ఇందిరానగర్‌కు చెందిన సదానందంతో పరిచయం ఏర్పడింది. సదానందం పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో 8 ఏళ్లుగా అతనితో సహజీవనం చేస్తుంది.
అతడికి భార్య పిల్లలు ఉన్నట్లు తెలిసినా పల్లవి సర్దుకుపోయింది. అయితే సదానందం తరచూ ఆమెను కొట్టేవాడు. ఈ విషయాన్ని పల్లవి పలుమార్లు తల్లి దృష్టికి తీసుకెళ్లింది. ఈ నెల 22న తల్లికి ఫోన్ చేసి సదానందం వేధింపులు భరించలేకపోతున్నానని ఊరికి వచ్చేస్తానని చెప్పింది. మరుసటి రోజు రాత్రి కూడా సదానందం ఆమెపై దాడి చేయడంతో మనస్తాపానికిలోనైన పల్లవి ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
దీనిని గుర్తించిన సదానందం బస్తీ వాసులతో కలిసి ఆమెను కిందకు దించి పరిశీలించగా అప్పటికే మృతి చెందింది. మృతురాలి తల్లి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయడంతో బంజారాహిల్స్ పోలీసులు సదానందంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.