నల్గొండ: కుటుంబ కలహాలతో పురుగు మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ మంగళవారం మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పర్వేదుల గ్రామానికి చెందిన పున్నె బ్రహ్మం పది సంవత్సరాల క్రితం పెద్దఅడిశర్లపల్లి మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన ధనలక్ష్మి(28)ని కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు విఘ్నేష్, కుమార్తె గాయత్రి సంతానం. వీరు పర్వేదుల గ్రామంలోనే కిరాణ దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. అన్యోన్యంగా సాగుతున్న వీరి దాంపత్య జీవితంలో గత కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో గత నెల 19న కుటుంబ కలహాలతో ధనలక్ష్మి ఇంట్లోనే పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం ఆమెను నాగార్జునసాగర్‌లోని కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం నల్గొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి మంగళవారం ఆమె మృతిచెందింది. మృతురాలి తల్లి కుంచెపు కళమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పచ్చిపాల పరమేష్ తెలిపారు. కాగా ఆస్పత్రిలోనే నల్లగొండ జడ్జి చేత మరణ వాంగ్మూలం రికార్డు చేసినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment