అర్థరాత్రి మెడికోకు అసభ్యకరమైన సందేశాలు | Youth Assult on Karnataka Medico in Shamshabad Hotel | Sakshi
Sakshi News home page

మెడికోతో యువకుల అసభ్య ప్రవర్తన

Published Wed, Aug 19 2020 7:29 AM | Last Updated on Wed, Aug 19 2020 7:29 AM

Youth Assult on Karnataka Medico in Shamshabad Hotel - Sakshi

మెడికోను వేధించిన ముగ్గురు యువకులను రిమాండ్‌కు తరలిస్తున్న పోలీసులు

శంషాబాద్‌: శంషాబాద్‌ పట్టణంలోని వీజేఆర్‌ హోటల్‌లో విశ్రాంతి తీసుకుంటున్న మెడికోతో అసభ్యంగా ప్రవర్తించిన ముగ్గురిని ఆర్‌జీఐఏ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఆర్‌జీఐఏ సీఐ విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కర్నాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన యువతి (24) ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ చదువుతోంది. వందేభారత్‌ మిషన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన విమానంలో సోమవారం రాత్రి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. శంషాబాద్‌ పట్టణం నుంచి ప్రైవేటు ట్రావెల్స్‌ ద్వారా బెంగళూరుకు వెళ్లేందుకు జాతీయ రహదారిపై నిలబడగా.. ఆమెను గమనించిన ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలకు చెందిన విజయ్‌కుమార్‌ (26) పురేందర్‌ కుమార్‌(25) శంషాబాద్‌ పట్టణంలోని వస్త్రవ్యాపారి పి.రామస్వామి కుమారుడు పి.ప్రవీణ్‌లు యువతితో మాటలు కలిపారు. బస్సు రావడానికి ఆలస్యమైతే పక్కనే ఉన్న వీజేఆర్‌ హోటల్‌లో గది తీసుకోవాల్సిందిగా ప్రోత్సహించారు.

బస్సు రావడానికి సమయం చాలా ఉండడంతో వారి మాటలు నమ్మిన యువతి విశ్రాంతి కోసం హోటల్‌లో గది అద్దెకు తీసుకుంది. సదరు యువకులు అదే హోటల్‌లో కొన్ని రోజులుగా అద్దెకుంటున్నారు. హోటల్‌లో యువతి గదిలోకి వెళ్లినప్పటి నుంచి తరచూ ఆమెతో సంభాషించేందుకు యత్నించారు. అంతకుముందే ఆమె ఫోన్‌ నంబరు కూడా తీసుకోవడంతో యువతి ఫోన్‌కు అర్థరాత్రి సమయంలో అసభ్యకరమైన సందేశాలు పంపారు. రాత్రి 2 గంటల సమయంలో గది తలుపులు తట్టి అసభ్యకరంగా మాట్లాడడంతో అప్రమత్తమైన యువతి తన సోదరుడికి ఫోన్‌లో విషయం చెప్పింది. దీంతో నగరంలో ఉండే యువతి సోదరుడి స్నేహితులు ఆర్‌జీఐఏ పోలీసు స్టేషన్‌కు తెల్లవారుజామున చేరుకుని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు విజయ్, పురేందర్‌ కుమార్, ప్రవీణ్‌లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వీజేఆర్‌ హోటల్‌పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement