వైఎస్సార్‌సీపీ నేత దారుణ హత్య | YSRCP leader Assassination At Eluru District | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేత దారుణ హత్య

Published Sun, May 1 2022 4:16 AM | Last Updated on Sun, May 1 2022 4:16 AM

YSRCP leader Assassination At Eluru District - Sakshi

పోలీసులకు లొంగిపోయిన నిందితులు వీరే.. మండవల్లి సురేష్‌ , ఉండ్రాజవరపు మోహన్‌ , శానం హేమంత్‌

ద్వారకా తిరుమల/దేవరపల్లి : ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గంజి నాగప్రసాద్‌ (55) శనివారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. పాత కక్షల నేపథ్యంలో అదే పార్టీకి చెందిన ముగ్గురు యువకులు కత్తులతో దాడిచేసి ఆయనను హత్యచేశారు. అనంతరం వారు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై గ్రామస్తుల ముసుగులో టీడీపీ వర్గీయులు పథకం ప్రకారం దాడికి పాల్పడ్డారు. అనంతరం ఎమ్మెల్యేను పక్కనే ఉన్న పాఠశాలలో నిర్బంధించారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో.. జిల్లా పోలీస్‌ యంత్రాంగం రంగప్రవేశం చేసి, నాలుగు గంటల అనంతరం ఎమ్మెల్యేను ఇంటికి పంపించారు. వివరాలివీ..

గంజి నాగప్రసాద్‌కు, గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు బిరుదుగడ్డ బజారియ్యకు పాతకక్షలు ఉన్నాయి. వీరు పార్టీలో రెండు వర్గాలుగా ఉంటున్నారు. ఇటీవల బజారియ్య వర్గంలోని మండవల్లి సురేష్‌కు చెందిన మిఠాయి బండిపై కొందరు దాడిచేశారు. ఇది గంజి ప్రసాదే చేయించాడని సురేష్, అతని స్నేహితులు ఉండ్రాజవరపు మోహన్, శానం హేమంత్, మరికొందరు భావించారు. ప్రతి విషయంలోనూ తమకు అడ్డుపడుతున్న నాగప్రసాద్‌ను ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని సురేష్, మోహన్, హేమంత్‌ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో.. శనివారం ఉ.7.30కు నాగప్రసాద్‌ పాల కోసం తన ఇంటి నుంచి వెళ్తున్నాడు. ఈ విషయాన్ని జి.నాగరాజు అనే వ్యక్తి నిందితులకు సమాచారం అందించాడు. దీంతో సురేష్, మోహన్, హేమంత్‌లు బైక్‌పై నాగప్రసాద్‌కు ఎదురెళ్లి, పాఠశాల వద్ద అతడి వాహనాన్ని ఆపారు. అనంతరం ముగ్గురూ ఒక్కసారిగా నాగప్రసాద్‌పై కత్తులతో దాడిచేశారు. ముందుగా అతడి చేతిని నరికేశారు. ఆ తరువాత మెడపై, కాలిపై నరికారు. అతడు చనిపోయినట్లు నిర్ధారించుకున్నాక వారు ద్వారకా తిరుమల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు.

టీడీపీ వర్గీయుల పన్నాగం.. ఎమ్మెల్యేపై దాడి
హత్య సమాచారం అందుకున్న గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఉ.9.25 గంటల సమయంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న స్థానిక టీడీపీ వర్గీయులతో పాటు, మరికొందరు బయటి వ్యక్తులు నాగప్రసాద్‌ మృతికి ఎమ్మెల్యేనే కారణమంటూ పథకం ప్రకారం వివాదాన్ని రేపారు. అంతేకాక.. ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యేపై దాడికి పాల్పడ్డారు. ఘటనకు సంబంధించిన ఫొటోలు చూస్తే ఇది స్పష్టమవుతోంది. వారే కాకుండా.. ఇంకా ఎంతోమంది టీడీపీ వర్గీయులు తలారిపట్ల దురుసుగా ప్రవర్తించారు. గ్రామస్తులను రెచ్చగొట్టడం మొదలుకుని, దాడిచేయడం వరకు వారి పాత్రే కనిపిస్తోంది.

పొరుగు గ్రామాల నుంచి వచ్చిన టీడీపీ వారు సైతం ఈ వివాదంలో నానా యాగీ చేశారు. అంతేకాక.. అడ్డొచ్చిన ద్వారకా తిరుమల ఎస్సై టి. వెంకటసురేష్, భీమడోలు ఎస్సై వీరభద్రరావు, కానిస్టేబుల్‌ నారాయణ, ఐడీ పార్టీ రమేష్‌ తదితరులు సైతం వీళ్ల దాడిలో గాయపడ్డారు. వార్త కవరేజీకి వచ్చిన విలేకరులపైనా దౌర్జన్యంచేశారు. సెల్‌ఫోన్లను బలవంతంగా లాక్కుని అందులోని ఫొటోలు, వీడియోలను తొలగించారు. ఎమ్మెల్యేను నిర్బంధించిన విషయాన్ని బయటికి పొక్కకుండా చేసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కానీ, అప్పటికే ప్రసార మాధ్యమాల ద్వారా విషయాన్ని తెలుసుకున్న ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు, ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ తదితరులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిర్బంధంలో ఉన్న ఎమ్మెల్యే తలారిని అదనపు బలగాల మధ్య, దేవరపల్లిలోని ఆయన ఇంటికి ప్రత్యేక వాహనంలో పంపించారు. 

తలారిపై టీడీపీ దాడులు కొత్తేమీ కాదు
ఎమ్మెల్యే తలారిపై టీడీపీ శ్రేణుల ఈ తరహా దాడులు కొత్తేమీ కాదు. 2019 ఎన్నికల ప్రచార సమయంలో మండలంలోని ఎం.నాగులపల్లికి వెళ్లిన తలారిని, మీడియా వారిని టీడీపీ వర్గీయులు నిర్బంధించి, అప్పట్లో నానా హంగామా చేశారు. ఆ గొడవ అప్పట్లో సంచలనం సృష్టించింది. మళ్లీ ఇప్పుడు ఇలా తెరవెనుక రాజకీయం చేశారని, తానంటే భయంతోనే టీడీపీ వర్గీయులు ఇలా చేస్తున్నారని ఎమ్మెల్యే తలారి అంటున్నారు. 

రాజకీయ హత్యగా చిత్రీకరించేందుకే.. 
పాత కక్షల నేపథ్యంలో జరిగిన గంజి నాగప్రసాద్‌ హత్యను స్థానిక టీడీపీ వర్గీయులు రాజకీయ హత్యగా చిత్రీకరించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే ఎమ్మెల్యేపై తిరగబడ్డారని నమ్మించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఇందులో భాగంగానే మీడియాను అడ్డుకున్నట్లు స్పష్టమౌతోంది. మరోవైపు.. ఎమ్మెల్యేపై దాడిచేసిన వ్యక్తులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు కోరుతున్నారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా మూడు పోలీస్‌ పికెట్లు ఏర్పాటుచేశారు. గ్రామంలో రెండు వారాలపాటు 144వ సెక్షన్‌ కింద నిషేధాజ్ఞలు విధించారు.

దాడి చేసింది టీడీపీ వారే
ఈ ఘటనపై ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ.. గ్రామంలో గంజి నాగప్రసాద్, బిరుదుగడ్డ బజారియ్య వర్గాల మధ్య మూడేళ్లుగా వర్గపోరు జరుగుతోందన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో బజారియ్య వర్గం విజయం సాధించిందని, ఎన్నికల్లో ఇద్దరికీ సమానంగా బాధ్యతలు అప్పగించామని తెలిపారు. తనకు ఇద్దరూ సమానమేనన్నారు. ఇద్దరి మధ్య సయోధ్యకు చాలాసార్లు ప్రయత్నించినా కుదరలేదన్నారు. ఇక ప్రసాద్‌ హత్య విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించానని.. అప్పటికి అక్కడ ఎలాంటి ఉద్రిక్తతా లేదన్నారు. అక్కడి నుంచి కొద్దిదూరం వెళ్లాక కొంతమంది కొత్త వ్యక్తులు దాడికి పాల్పడ్డారని, వారిని టీడీపీ నాయకులుగా గుర్తించానని తలారి తెలిపారు.

ప్రసాద్‌ కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే చెప్పారు. హత్య వెనుక తన ప్రోద్బలం ఉన్నట్లు ప్రసాద్‌ భార్య చేస్తున్న ఆరోపణలపై విలేకరులు ప్రశ్నించగా.. తనకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టంచేశారు. ఇందులో కూడా టీడీపీ నాయకుల కుట్ర ఉందన్నారు. డీఐజీ, ఎస్పీలు తనను సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చారని తలారి వెంకట్రావు తెలిపారు. ఇప్పటికే హత్యకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని, దీని వెనుక ఇంకా ఎవరున్నా అరెస్టుచేసి చర్యలు తీసుకుంటారని ఎమ్మెల్యే చెప్పారు. మరోవైపు.. ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై దాడి నేపథ్యంలో.. ఆయనను కలిసేందుకు రాజానగరం ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా శనివారం దేవరపల్లి వచ్చారు. ఎమ్మెల్యే వెంకట్రావుపై బయటి వ్యక్తులు దాడికి పాల్పడ్డారని.. వీరిలో టీడీపీ నేతలున్నట్లు తెలుస్తోందని, దీనిపై దర్యాప్తు జరిపిస్తామని ఆయన చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement