సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా కడప నగరంలోని సంధ్యాసర్కిల్ సమీపంలో శుక్రవారం వైఎస్సార్‌సీపీ నాయకుడు సి.శ్రీనివాసులరెడ్డి (42) దారుణహత్యకు గురయ్యాడు. బురఖాలు ధరించి మాటువేసిన దుండగులు ఒక్కసారిగా కొడవళ్లతో దాడిచేశారు. పిడిబాకులతో విచక్షణారహితంగా పొడిచారు. దుండగుల నుంచి తప్పించుకునే క్రమంలో పరుగెత్తిన శ్రీనివాసులరెడ్డి వందడుగుల దూరంలో కుప్పకూలిపోయాడు. సినిమా ఫక్కీలో హత్యచేసిన దుండగులు పరారయ్యారు. పోలీసుల కథనం మేరకు.. కమలాపురం నియోజకవర్గం వల్లూరు మండలం చిన్ననాగిరెడ్డిగారిపల్లె గ్రామానికి చెందిన శ్రీనివాసులరెడ్డి కొన్నేళ్లుగా కడపలో నివాసం ఉంటున్నాడు.
వైఎస్సార్‌సీపీలో చురుగ్గా పనిచేస్తూ, ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డికి ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్నాడు. రోజూ సంధ్యాసర్కిల్ సమీపంలో ఎర్రముక్కపల్లి దారిలో ఉన్న రాబిట్ జిమ్‌కు వ్యాయామానికి వెళ్లేవాడు. ఆయన కదలికలను గమనించిన దుండగులు శుక్రవారం ఉదయం జిమ్ సమీపంలో బురఖాలు ధరించి మాటువేశారు. శ్రీనివాసులరెడ్డి జిమ్ నుంచి బయటకు రాగానే మారణాయుధాలతో ఒక్కసారిగా దాడిచేశారు. కత్తిపోట్లకు గురైన శ్రీనివాసులరెడ్డి దుండగుల నుంచి రక్షించుకునేందుకు కొద్దిదూరం పరుగెత్తి కుప్పకూలిపోయాడు. అతడు రక్తపుమడుగులో తీవ్రగాయాలతో పడిపోవడంతో నిందితులు పరారయ్యారు.
సమాచారం అందుకున్న శ్రీనివాసులరెడ్డి భార్య మౌనిక అక్కడికి చేరుకుని స్థానికుల సహకారంతో భర్తను రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌కు చేరిన కొద్దిసేపటికే శ్రీనివాసులరెడ్డి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శ్రీనివాసులరెడ్డి హత్యకు నిందితులతో ఉన్న ఆర్థిక లావాదేవీలు, భూ తగాదాలే కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. నిందితుల్ని పట్టుకునేందుకు కడప డీఎస్పీ ఎండీ షరీఫ్ సారథ్యంలో నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.
వైఎస్సార్‌సీపీలో చురుగ్గా పనిచేస్తున్న శ్రీనివాసులరెడ్డి హత్యపట్ల ఎమ్మెల్యే పోచిమరెడ్డి రవీంద్రనాథరెడ్డి, ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి తీవ్ర ది్రగ్బాంతి వ్యక్తం చేశారు. మృతుడి భార్య మౌనిక ఫిర్యాదు మేరకు మోపూరి ప్రతాప్‌రెడ్డి, పాలెంపల్లి సుబ్బారెడ్డి, జమీల్ మొబైల్స్ యజమాని జమీల్, గుంటి నాగేంద్రలపై క్రైమ్ నంబర్ 252/2023 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఇద్దరు కుమారులు మహాదీప్‌రెడ్డి (14), హనుదీప్‌రెడ్డి(12) ఉన్నారు. శ్రీనివాసులరెడ్డి స్వగ్రామంలో శుక్రవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.
‘లోకేశ్ పర్యటనలోనే హత్యకు బీజం’
శ్రీనివాసులరెడ్డి హత్యకేసులో నిందితులు పావులు మాత్రమేనని కమలాపురం ఎమ్మెల్యే పోచిమరెడ్డి రవీంద్రనాథరెడ్డి చెప్పారు. ఇటీవల టీడీపీ నేత లోకేశ్ యువగళం పాదయాత్రలో ఈ హత్యకు బీజం పడిందని ఆరోపించారు. శ్రీనివాసులరెడ్డిని హత్యచేసి అందరినీ భయాందోళనలకు గురిచేయాలని కుట్ర చేసినట్లు భావిస్తున్నామన్నారు. సూత్రధారులపై లోతైన దర్యాప్తుచేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment