పల్నాడులో మళ్లీ పేట్రేగిన టీడీపీ మూకలు.. | YSRCP worker Nagaraju attacked with knives | Sakshi
Sakshi News home page

పల్నాడులో మళ్లీ పేట్రేగిన టీడీపీ మూకలు..

Published Fri, Aug 9 2024 5:52 AM | Last Updated on Fri, Aug 9 2024 5:52 AM

YSRCP worker Nagaraju attacked with knives

వినుకొండలో పట్టపగలు వైఎస్సార్‌సీపీ కార్యకర్త నాగరాజుపై కత్తులతో దాడి

సెల్‌ఫోన్‌ సిగ్నళ్ల ఆధారంగా నిందితులను పట్టుకున్న పోలీసులు

సాక్షి, నరసరావుపేట, వినుకొండ (నూజెండ్ల): అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటినా ఎన్నికల హామీలపై ఏమాత్రం దృష్టిపెట్టని టీడీపీ–­జనసేన–బీజేపీ కూటమి సర్కారు రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని మాత్రం అనుకున్నది అనుకున్న­ట్లుగా పక్కాగా అమలుచేస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలు­వ­డిన రోజు నుంచి వైఎస్సార్‌సీపీ సానుభూతి­పరులను హత్యచేయడం, వారిపై దాడులకు తెగబడడం, ఆస్తులు ధ్వంసం చేసి గ్రామాల నుంచి వెళ్లగొట్టడం పల్నాడులో సర్వసాధారణమ­య్యా­యి. 

చివరికి సొంత ఊర్లో ఇళ్లు, పొలాలు వదిలి పొట్టకూటి కోసం వలస వెళ్లి చిన్నచిన్న పనులు చేసుకుంటున్న వారిని సైతం వెంటాడి కిడ్నాప్‌ చేసి అంతమొందించడానికి తెలుగుదేశం పార్టీ గూండాలు వెనుకాడడంలేదు. తాజాగా.. వినుకొండ రూరల్‌ మండలం వెంకుపాలెం గ్రామం వద్ద మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం జంగమ­హేశ్వరపాడుకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఒంటేరు నాగరాజు ఆటోలో వెళ్తుండగా టీడీపీ నేతలు దారికాచి దాడిచేశారు. అందులోని అతని కుటుంబ సభ్యుల్ని గాయపరిచి నాగరాజును కిడ్నాప్‌ చేయడం తీవ్ర అలజడి రేపింది. పోలీసులు కిడ్నా­­పర్లను పట్టుకుని నాగరాజును పోలీసుస్టేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి నాగరాజు బావమరిది రవి తెలిపిన వివరాలు ఏమిటంటే..

వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడైన నాగరాజు కుటుంబ సభ్యులు టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సొంత గ్రామం జంగమేశ్వరపాడు గ్రామాన్ని విడచిపెట్టి వినుకొండలోని తన బావమరిది రవి వద్దకు వచ్చి ఉంటున్నారు. బతుకుతెరువు కోసం ఆటోలో కూరగాయలు అమ్ముకుంటున్నాడు. ఈ నేపథ్యంలో.. నాగరాజు తన తల్లి వెంకమ్మ, బావమరిది రవితో కలిసి గురువారం ఉ.8.30 ప్రాంతంలో వెల్లటూరు వైపు వెళ్తుండగా వెంకుపాలెం కురవ వద్దకు రాగానే టీడీపీ నేతలు కారుతో ఆటోను అడ్డగించారు. 

కారులో వచ్చిన సుమారు 8 మంది రవిపై కత్తులతో దాడిచేసి గాయపరిచారు. ఆ తర్వాత నాగరాజు తల్లిపైనా దాడిచేసి నాగరాజును బలవంతంగా కారులో ఎక్కించుకుని వెల్లటూరు వైపు దూసుకెళ్లారు. కిడ్నాప్‌ చేసింది జంగమేశ్వరపాడుకు చెందిన టీడీపీ నేతలే అని నాగరాజు కుటుంబ సభ్యులు నిర్థారించారు.

అందరూ చూస్తుండగానే..
పట్టపగలు అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై కత్తులతో స్వైరవిహారం చేస్తూ నాగరాజును కిడ్నాప్‌ చేయడంతో వినుకొండ ప్రాంతంలో అలజడి రేగింది. అక్కడున్న స్థానికులు దాడిలో గాయపడిన రవి, నాగరాజు తల్లి వెంకాయమ్మలను వినుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న నాగరాజు భార్య, నాగమల్లేశ్వరి, చెల్లెళ్లు భువనేశ్వరి, రజనీలతోపాటు నాగరాజు తండ్రి సాంబయ్య నాగరాజును చంపేస్తారని, కాపాడాలంటూ భోరున విలపించారు. 

ఆ టీడీపీ నేతలే కిడ్నాప్‌ చేశారు..
నాగరాజు తండ్రి సాంబయ్య మీడియాతో మాట్లా­డుతూ..  జంగమేశ్వరపాడుకు చెందిన టంగుటూరి శబరి కుమారుడు మల్లికార్జున, కొండా, ఆరెద్దుల మణి, కంచర్ల బొర్రయ్య కుమారుడు రామాంజి, నానారావు కుమారుడు జల్లయ్యతో­పాటు మరో ముగ్గురు తన కుమారుడిని కిడ్నాప్‌ చేశారని తెలిపారు. మరోవైపు.. ఆస్పత్రి వద్ద నాగరాజు భార్య సొమ్మిసిల్లి పడిపోయింది. ఆస్పత్రి ఆవర­ణలో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బతుకుతెరువు కోసం, ప్రాణాలు కాపాడుకునేందుకు గ్రామంలో పొలాలు, ఇళ్లు వదలేసి దూరంగా బతుకుతున్నప్పటికీ టీడీపీ నేతలు తమను ఇక్కడ కూడా బతకనివ్వడంలేదని వాపోయారు. 

సెల్‌ఫోన్‌ సిగ్నళ్ల ఆధారంగా నిందితుల పట్టివేత..
నాగరాజు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వినుకొండ సీఐ శోభన్‌బాబు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి కిడ్నాపర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సెల్‌ఫోన్ల సిగ్నల్‌ ఆధారంగా నిందితులను బొల్లాపల్లి మండలం మర్రిపాలెం వద్ద అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దాడిలో ఏడుగురు పాల్గొనగా ఆరుగురిని పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఒక వ్యక్తి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు.. బాధితుడు నాగరాజును రక్షించిన పోలీసులు బొల్లాపల్లి స్టేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

కత్తులతో దాడిచేసి కిడ్నాప్‌ చేశారు..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మా బావ నాగరాజు కుటుంబం టీడీపీ దాడులకు భయపడి వినుకొండలో నా వద్దకు వచ్చి కూరగాయల వ్యాపా­రం చేసుకుంటు­న్నారు. అయినాసరే వదిలిపెట్టకుండా గురు­వా­రం ఉదయాన్నే కత్తులతో దాడిచేసి గాయ­పరిచారు. అడ్డొచ్చిన మహిళలపై కూడా దాడి­చేసి నాగరాజును కారులో ఎక్కించుకుని పరా­రయ్యారు. నా ఫోన్‌ను సైతం లాక్కె­ళ్లారు. – రవి, దాడిలో గాయపడిన నాగరాజు బావమరిది

నాగరాజుకు ఏం జరిగినాబాబుదే బాధ్యత
మాజీమంత్రి అంబటి ఫైర్‌
సాక్షి, అమరావతి: పల్నాడులో టీడీపీ గూండాలు కిడ్నాప్‌ చేసిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఒంటేరు నాగరాజుకు ఎలాంటి హాని జరిగినా చంద్రబాబు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని మాజీమంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. పల్నాడులో నాగరాజు కిడ్నాప్‌పై ఆయన తీవ్రంగా స్పందించారు. అసలు రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ ఉందా? అంటూ   సీఎం చంద్రబాబు, హోంమంత్రి అని­తను ప్ర  శ్నించారు. 

తాడేపల్లిలోని వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. నాగరాజుకు ఏమైనా హాని జరిగితే తీవ్ర పరిణామాలుంటాయి. రాష్ట్రంలో ఎంత దారుణమైన ఘటనలు జరుగుతున్నా యో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  ఇటీవలే వినుకొండలో ఓ వైఎస్సార్‌సీపీ కార్యకర్తను అతి దారుణంగా నరికి చంపారు. ఈ ఘటనలపై చంద్రబాబు స్పందించాలన్నారు. మాజీమంత్రి మేరుగ నాగార్జున  పాల్గొన్నారు.

పోలీసులు చేతులేత్తేశారు: కొరముట్ల
రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడే అంశంలో పోలీసులు పూర్తిగా చేతులేత్తేశారని, కేవలం రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలుచేసేందుకే అన్నట్లుగా వారి ప్రవర్తన ఉందని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు తాడేపల్లిలో మాట్లాడుతూ ఫైర్‌ అయ్యారు. మొన్న వినుకొండ, నిన్న నంద్యాల, జగ్గయ్యపేట ఘటనలు జ రగ్గా ఈరోజు కిడ్నాప్‌ జరగడం అత్యంత దారుణమన్నారు.  జగన్‌కి ఎక్కువ భద్రత ఉన్నట్లు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని  మండిపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement