దాతకు స్వామివారి చిత్రపటం అందిస్తున్న ఆలయ సిబ్బంది
ఐ.పోలవరం: గ్రామాల్లో ఎస్సీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎం.విక్టర్ ప్రసాద్ అన్నారు. ఆదివారం ఐ.పోలవరం మండలం మురమళ్ల వచ్చిన ఆయన స్థానికంగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, లోకసభ స్పీకర్ జీఎంసీ బాలయోగి, బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్సీలు తమ సమస్యలను ఆయనకు లిఖిత పూర్వకంగా అందజేశారు. ఆయన వెంట విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు వడ్డి నాగేశ్వరరావు, రేవు శ్రీనివాసరావు, గుత్తాల డాన్‌బాబు, గుత్తాల ప్రసాద్, అంబటి రామకృష్ణ తదితరులున్నారు.
వాడపల్లి నిత్నాన్నదాన
పథకానికి భక్తుల విరాళాలు
ఆత్రేయపురం: కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ అవరణలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి భక్తులు విరాళాలు అందించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ రుద్రరాజు రమేష్‌రాజు, ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. నరసాపురానికి చెందిన పి.సూర్యకృష్ణ బాల సుబ్రహ్మణ్యం రూ.11 వేలు, పి.బాల షన్ముఖ ఆదిత్య రూ.11 వేలు, పీవిఎస్‌ఎస్‌ఆర్ ప్రసాద్, సత్యనాగ జ్యోతి దంపతులు రూ.11 వేలు విరాళాలు అందించినట్లు తెలిపారు. దాతలకు ఆలయ సిబ్బంది చేతుల మీదుగా స్వామివారి చిత్రపటం అందించారు.
కిక్కిరిసిన అయినవిల్లి
అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వరుని ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. ఆలయ ప్రధానార్చకులు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వామికి మేలుకోల్పు సేవ నిర్వహించారు. అనంతరం స్వామికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి లఘున్యాస అభిషేకాల్లోను, లక్ష్మీగణపతి హోమంలోను అధిక సంఖ్యలో భక్త దంపతులు పాల్గొన్నారు. స్వామివారికి గరిక పూజ జరిపారు. నూతన వాహనాలకు పూజలు చేశారు. చిన్నారులకు అన్న ప్రాసనలు, అక్షరాభ్యాసాలు, నామకరణలు చేశారు. స్వామివారి నిత్యాన్నదాన పథకం నిర్వహణ కోసం రూ.17,011 విరాళంగా భక్తులకు సమర్పించారు. స్వామివారికి ఆదివారం ఒక్క రోజు ఆదాయం రూ.80,021లు లభించిందని ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.
నేడు యథావిధిగా స్పందన
అమలాపురం రూరల్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమాలు సోమవారం యథావిధిగా జరుగుతాయని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో జిల్లా స్థాయిలోను, ఆర్డీవో కార్యాలయంలో డివిజన్ స్థాయిలో, తహసీల్దార్ కార్యాలయాల్లో, గ్రామ, వార్డు సచివాలయాలలో అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారని వివరించారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచే అర్జీలను స్వీకరిస్తారని, గ్రామ వార్డు సచివాలయాల్లో మాత్రం మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య విజ్ఞాపనలు స్వీకరిస్తారని కలెక్టర్ తెలిపారు.
నేడు సప్త గోదావరి
ఆధునీకరణకు శ్రీకారం
రూ. కోటి మంజూరు చేసిన ప్రభుత్వం
రామచంద్రపురం రూరల్: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని సప్త గోదావరి ఆధునికీకరణ పనులు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభించనున్నట్లు ఈఓ పితాని తారకేశ్వరరావు ఆదివారం విలేకరులకు తెలిపారు. సప్తగోదావరిని ఆధునికీకరించి భక్తుల మనోభావాలకు అనుగుణంగా స్వచ్ఛమైన నీరు ఎల్లప్పుడూ ఉంచేలా రాష్ట్ర బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రత్యేక శ్రద్ధతో సప్తగోదావరి ప్రక్షాళనకు నిధులు మంజూరు చేయించారన్నారు. దేవదాయ శాఖ సీజీఎఫ్ (కామన్ గుడ్ ఫండ్) నిధులు రూ. కోటి మంజూరు చేసిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment