మెడికల్ షాపు క్యాష్ కౌంటర్‌లోని రూ. లక్ష చోరీ
సినీ ఫక్కీలో బైక్‌పై పారిపోయిన ఇద్దరు యువకులు
పి.గన్నవరం: స్థానిక మెయిన్‌రోడ్డులో ఆదివారం మందుల షాపు వద్ద సరుకులు కొనుగోలు చేస్తున్నట్టు నటించి క్యాష్ కౌంటర్‌లో సుమారు లక్ష రూపాయల నగదుతో ఉన్న బ్యాగ్‌ను ఇద్దరు యువకులు దొంగిలించి బైక్‌పై పారిపోయారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనతో షాపు యజమాని ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక పోతురాజు స్వామిగుడి ఎదురుగా తోలేటి రాంబాబు గణేష్ మెడికల్ షాపును నిర్వహిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పల్సర్ బైకుపై ఇద్దరు యువకులు వచ్చి షాపు వద్ద ఆగారు. ఒకడు బైక్‌పై ఉన్నాడు. మరొక యువకుడు షాపు యజమానిని డైపర్స్ కావాలని అడిగాడు. ఈ క్రమంలో తన వద్ద రూ.1,400ల విలువైన పది, ఇరవై రూపాయల నోట్లు ఉన్నాయి, వాటిని తీసుకుని పెద్ద నోట్లు ఇస్తారా అని అడిగాడు. వాటిని లెక్క చేసే సరికి రూ.1,200 మాత్రమే ఉండటంతో దానికి సరిపడా రాంబాబు పెద్దనోట్లు ఇచ్చారు. అర్జంటుగా డైపర్స్ ఇవ్వాలని అగంతకుడు కోరాడు. వాటిని షాపు యజమాని తీసి ఇచ్చేలోగా.. క్యాష్ కౌంటర్‌లోని సూమారు లక్ష రూపాయల నగదు ఉన్న బ్యాగును తీసుకుని బైక్‌పై ఉడాయించారు. వారిద్దరూ రావులపాలెం వైపు పారిపోయినట్టు గుర్తించారు. దీంతో షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై బి.శివకృష్ణ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment