
ఇంటర్ పరీక్షలకు వేళాయె
● మార్చి ఒకటి నుంచి 20 వరకూ నిర్వహణ
● జిల్లావ్యాప్తంగా 40 కేంద్రాలు
● హాజరుకానున్న 27,312 మంది విద్యార్థులు
రాయవరం: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధం అవుతోంది. మార్చి 1న ఫస్టియర్ పరీక్షలతో ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలు మార్చి 20న సెకండియర్ పరీక్షలతో ముగియనున్నాయి. జిల్లా మొత్తం మీద 27,312 మంది విద్యార్థులు 40 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. ప్రశ్నపత్రాలను 14 స్టోరేజీ పాయింట్లకు తరలించే ప్రక్రియ త్వరలోనే చేపట్టనున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రానికి మూడు సెట్ల పరీక్ష ప్రశ్నపత్రాలు చేరుకున్నాయి. వీటిని అమలాపురం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో పోలీసు బందోబస్తుతో భద్రపరిచారు. పరీక్షలను సమర్థంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144వ సెక్షన్ అమల్లో ఉంటుంది. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
ఈసారి జంబ్లింగ్ విధానంలోనే
ఈసారి కూడా పరీక్షలు జంబ్లింగ్ విధానంలోనే నిర్వహిస్తున్నారు. ఇంటర్ ఫస్టియర్ 11,023 జనరల్ విద్యార్థులు, 2,408 మంది వొకేషనల్, ఇంటర్ సెకండియర్ జనరల్ విద్యార్థులు 11,235 మంది, వొకేషనల్ విద్యార్థులు 2,646 మంది పరీక్షలకు హాజరు కానున్నారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఇంటర్మీడియెట్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఏమైనా సమస్యలుంటే కంట్రోలు రూమ్‌లో ఏర్పాటు చేసిన 9550335191 నంబరుకు ఫోన్ చేయవచ్చు. ఈ సంవత్సరం కలెక్టరేట్లో కూడా ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు.
హాల్ టికెట్లు డౌన్ లోడ్
విద్యార్థుల హాల్ టికెట్లను నేరుగా డౌన్ లోడ్ చేసుకునే అవకాశాన్ని ఇంటర్మీడియెట్ బోర్డ్ కల్పించింది. విద్యార్థి పేరు, హాల్ టికెట్ నంబరును టైప్ చేస్తే పరీక్ష కేంద్రం వివరాలు తెలుస్తాయి. ఇప్పటికే హాల్ టికెట్లను ప్రిన్సిపాల్స్ విద్యార్థులకు అందజేస్తున్నారు. ఇంటర్మీడియేట్ బోర్డు ఏర్పాటు చేసిన 95523 00009 వాట్సాప్ నంబరుకు ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఏర్పాటు చేసింది. మొదటగా వాట్సాప్ నంబరుకు హాయ్ అని ఇంగ్లిషులో టైప్ చేసి పంపించాలి. వెంటనే ప్రభుత్వ సర్వీసులు డిస్‌ప్లే అవ్వగానే, విద్యాశాఖను ఎంపిక చేసుకోవాలి. అందులో విద్యార్థి ఆధార్ నంబరు లేదా రోల్ నంబరును టైప్ చేయాలి. తర్వాత విద్యార్థి పుట్టిన తేదీ, నెల, సంవత్సరం టైప్ చేయాలి. కాసేపట్లో విద్యార్థి హాల్ టికెట్ అదే వాట్సాప్‌కు పీడీఎఫ్ ఫార్మేట్‌లో డౌన్‌లోడ్ అవుతుంది.
దివ్యాంగులకు సదుపాయాలు
దృష్టిలోపం ఉన్న వారు పరీక్ష రాసేందుకు సహాయకుడిని నియమించుకోవచ్చు. వీరికి జంబ్లింగ్ నుంచి మినహాయింపు ఉంది. పరీక్ష రాసేందుకు 30 నిమిషాల అదనపు సమయం ఇస్తారు. దివ్యాంగ శాతాన్ని బట్టి విద్యార్థికి ఆయా సబ్జెక్టుల్లో ఉత్తీర్ణతా మార్కులను తగ్గిస్తారు. వినికిడి లోపం ఉంటే పై మినహాయింపులతో పాటు ఒక లాంగ్వేజ్‌లో పార్ట్–1, పార్ట్–2 నుంచి మినహాయింపు ఇస్తారు. ఒకేషనల్ విద్యార్థులకు ఆంగ్లంలో చదివే కమ్యూనికేషనన్ స్కిల్స్ నుంచి మినహాయిస్తారు. శారీరక వైకల్యం ఉంటే రెండు చేతులు లేని వారికి స్క్రైబ్‌ను ఇస్తారు. డిస్లెక్సియా లోపం ఉన్న వారికి గంట అదనపు సమయం ఇస్తారు.
కట్టుదిట్టమైన ఏర్పాట్లు
ఎక్కడా అవకతవకలకు అవకాశం లేకుండా పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం. పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించం. మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే దాని తీవ్రతను బట్టి 8 పరీక్షల వరకూ డిబార్ చేస్తాం. ఉదయం 6.45కు రేడియోలో వచ్చే ప్రాంతీయ వార్తల్లో చెప్పే సెట్ నంబర్ ప్రశ్నాపత్రాన్ని పోలీస్ స్టేషన్ నుంచి ఉదయం 8.3 0గంటలకు పరీక్షా కేంద్రానికి తరలిస్తారు.
– వనుము సోమశేఖరరావు ఇంటర్మీడియెట్
జిల్లా విద్యాశాఖ అధికారి, అమలాపురం
జిల్లా నుంచి ఇంటర్ రాసే విద్యార్థులు : 27,312
ప్రథమ సంవత్సరం విద్యార్థులు –13, 431
ద్వితీయ సంవత్సరం విద్యార్థులు – 13,881
పరీక్షా కేంద్రాలు: 40
సమస్యాత్మక పరీక్షా కేంద్రాలు: 01
ఫ్లయింగ్ స్క్వాడ్స్ – 4
సిట్టింగ్ స్క్వాడ్స్ – 3

ఇంటర్ పరీక్షలకు వేళాయె
Comments
Please login to add a commentAdd a comment