
నిరుద్యోగుల జీవితాలతో ఆటలొద్దు
వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం
జిల్లా అధ్యక్షుడు శిరీష్
అమలాపురం టౌన్: ఎనిమిది నెలల పాలనలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువత జీవితాలతో ఆటలాడుతోందని, వారిని నట్టేట ముంచుతోందని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మిండగుదిటి శిరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా గ్రూప్ –2 పరీక్షల రాసే అభ్యర్థుల విషయంలో సైతం కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతపై ఆది నుంచి వహిస్తున్న నిర్లక్ష్యమే వహించిదని ఆరోపించారు. ఈ మేరకు శిరీష్ అమలాపురంలో ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. గ్రూప్–2 అభ్యర్థులకు రోస్టర్ విధానాన్ని సరిచేసి పరీక్షలు నిర్వహించాల్సిన ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేస్తామని చెబుతూ చివరి నిమిషం వరకూ డైలమాలో పడేడయం సరికాదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, విద్యా మంత్రి ఈ పరీక్షల నిర్వహణలో కల్లబొల్లి కబుర్లు చెబుతూ చివరి నిమిషంలో ఆ నెపాన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌పై నెట్టేసి అర్ధంతరంగా ఆదివారం పరీక్ష పెట్టడం వారిని అయోమయంలో పడేయడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీ మేరకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు సరికదా కనీసం పోటీ పరీక్షలైనా సక్రమంగా నిర్వహించకుండా నిరుద్యోగ యువత భవితను ఈ ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రతీ ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తానని చెప్పిన ప్రభుత్వం అదీ అమలు చేయకుండా నిరుద్యోగ యువత జీవితాలను అగమ్య గోచరం చేస్తోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి సరైన సమయంలో గుణపాఠం చెప్పేందుకు నిరుద్యోగ యువత కాచుకుని ఉందని శిరీష్ స్పష్టం చేశారు.
సత్యదేవుని సన్నిధిలో
భక్తజన వాహిని
అన్నవరం: సత్యదేవుని సన్నిధికి ఆదివారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. సుమారు 50 వేల మందికి పైగా భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున రత్నగిరిపై, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధుమిత్రులు సత్యదేవుని దర్శించేందుకు రత్నగిరికి తరలివచ్చారు. దీనికి తోడు మాఘ బహుళ దశమి పర్వదినం కావడంతో పెద్ద సంఖ్యలో ఇతర భక్తులు కూడా తరలి వచ్చారు. దీంతో ఆలయంలో తీవ్ర రద్దీ ఏర్పడింది. ఉదయం 9 గంటల వరకూ ఓ మాదిరిగా ఉన్న రద్దీ తరువాత ఒక్కసారిగా పెరిగిపోయింది. సాయంత్రం వరకూ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉచిత దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. రద్దీ కారణంగా అంతరాలయ దర్శనాలను మధ్యాహ్నం వరకూ నిలిపివేశారు. మొత్తం 50 వేల మంది భక్తులు రత్నగిరికి వచ్చారని అధికారులు తెలిపారు. దేవస్థానానికి రూ.50 లక్షలు పైగా ఆదాయం సమకూరింది. సత్యదేవుని వ్రతాలు సుమారు 4 వేలు జరిగాయి. స్వామివారి నిత్య కల్యాణంలో 50 మంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment