
ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
● సీసీ కెమెరాల నిఘా నడుమ
పరీక్షల నిర్వహణ
● జిల్లా పరీక్షల కమిటీ సమావేశంలో
డీఐఈవో సోమశేఖరరావు వెల్లడి
అమలాపురం టౌన్: మార్చి 1 నుంచి 20వ తేదీ వరకూ జరగనున్న ఇంటర్మీడియెట్ థియరీ పరీక్షలు నిర్వహణ అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సంసిద్ధమై ఉండాలని జిల్లా ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (డీఐఈవో) వనుము సోమశేఖరరావు ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఆదివారం జరిగిన ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణ కమిటీ సమావేశంలో డీఐఈవో మాట్లాడారు. ఇంటర్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో నిర్దేశించిన 40 పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటున్న దృష్ట్యా పోలీసు పహరా ఉంటుందని తెలిపారు. ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్ధులు, ఇన్విజిలేటర్లు సెల్‌ఫోన్లు వాడకూడదని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రం వద్ద చీఫ్ సూపరింటెండెంట్ మాత్రం ఇంటర్మీడియెట్ విద్యా మండలి సరఫరా చేసిన సాధారణ ఫోన్‌ను పరీక్షకులకు సంబంఽధించిన సమాచారం కోసం వాడవచ్చని సూచించారు. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులైన అధికారులకు పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిబంధనలను డీఐఈవో తెలిపారు. జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు వై.లక్ష్మణరావు, ఎం.రామారావు, కె.శ్రీనివాసరావు, బల్క్ ఇన్‌చార్జి డి.శ్రీనివాసరావు, జిల్లా జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగశ్వరరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment