అదనపులోడు
ఆక్వా రైతులపై
సాక్షి, అమలాపురం: దేశీయంగా.. అంతర్జాతీయంగా ఎగుమతులు పెరగడంతో ధరలు పెరిగి కోలుకుంటున్న ఆక్వా ఊపిరి తీసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వివిధ రకాలుగా విద్యుత్ చార్జీల మోత మోగిస్తూ ఆక్వా రైతులను ముప్పుతిప్పులు పెడుతోంది. అదనపులోడు వినియోగం బిల్లు.. దానిపై అపరాధ రుసుము.. ఆపై అదనపు వినియోగానికి డిపాజిట్.. ఇవి కాదని కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు.. సర్వీస్ లైన్ చార్జీల పేరుతో ఆక్వా రైతుల నడ్డివిరుస్తోంది.
సర్వీసు లైన్ చార్జీల మోతపై రైతుల ధర్నా
జిల్లాలో వెనామీ సాగుకు విద్యుత్ శాఖ యూనిట్‌కు రూ.1.50 చొప్పున రాయితీపై విద్యుత్ అందిస్తోంది. జిల్లాలో 5,970 వరకు ఆక్వా సర్వీసులు ఉండగా, వీటిలో 4,870 రాయితీ సర్వీసులున్నాయి. ఇటీవల రొయ్యల ధరలు పెరగడంతో రైతులు ఈ ఏడాది తొలి పంటను పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. ఈ సమయంలో విద్యుత్ శాఖ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రైతులకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇటీవల ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లిలో ముందస్తు సమాచారం ఇవ్వకుండా విద్యుత్ నిలిపివేయడంతో చెరువులోని రూప్ చందువాలు చనిపోయి రైతులు రూ.లక్షల్లో నష్టపోయిన విషయం తెలిసింది. అలాగే సర్వీసు లైన్ చార్జీల మోత మోగిస్తున్నారని సఖినేటిపల్లి మండలానికి చెందిన రైతులు ఇటీవల రాజోలు ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో సోమవారం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. రైతుల నుంచి ప్రతిఘటన అధికంగా ఉండడంతో విద్యుత్ సరఫరా తొలగింపు తాత్కాలికంగా నిలుపుదల చేసినా, వెనామీ రైతుల నెత్తిన విద్యుత్ చార్జీల కత్తి వేలాడుతూనే ఉంది.
బిల్లులో చూపించరు.. నోటీసు ఇవ్వరు
అదనపు విద్యుత్ వినియోగంపై రైతులకు సమాచారం ఉండడం లేదు. మీ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని, మీ విద్యుత్ బిల్లు చెల్లింపునకు ఫలానా తేదీ ఆఖరు అని సెల్ ఫోన్లకు సంక్షిప్త సమాచారం పంపిస్తున్న విద్యుత్ శాఖ మీరు పరిధికి మించి విద్యుత్ వినియోగం చేస్తున్నారనే సమచారం ఇవ్వడం లేదు. కనీసం నెలనెలా వచ్చే బిల్లులో కూడా ఓవరు లోడు ఇంత బకాయి ఉందని కాని, అడిషినల్ కంజప్షన్ డిపాజిట్ (ఏసీడీ) ఇంత చెల్లించాలని కాని చూపించడం లేదు. వీటిపై విడిగా నోటీసు కూడా రైతులకు జారీ చేయడం లేదు. ఒక రాత్రికి రాత్రి స్పెషల్ డ్రైవ్ అని వచ్చి విద్యుత్ సర్వీస్‌లు కట్ చేసుకుపోతున్నారు. ఏసీడీ, ఓవర్ లోడు చార్జీలు చాలామందికి రూ.50 వేలకు పైబడి ఉంటోంది. ఒకేసారి ఇంత పెద్ద మొత్తం చెల్లించడం చిన్న రైతులకు ఇబ్బందిగా మారింది. విచిత్రంగా ఏసీడీ చార్జీల వివరాలు ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నాయి. కానీ వేళ్ల మీద లెక్క పెట్టే స్థాయిలోనే రైతులు మాత్రమే ఆన్‌లైన్‌లో చూస్తుంటారు. పైగా దీనిలో ఓవర్ లోడు చార్జీలు కనిపించవు. ఈ రెండు పక్కాగా తెలుసుకోవాలంటే అమలాపురంలో ఉన్న విద్యుత్ శాఖ ఎకౌంట్స్ కార్యాలయానికి వెళ్లాల్సిందే.
ఇప్పుడు ట్రాన్స్‌ఫార్మర్ల భారం
ఆక్వా విద్యుత్‌కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 5,450 ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి. ఆక్వా రైతులకు 25 కేవీ, 40 కేవీ, 62 కేవీ, 100 కేవి, 150 కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి. అదనంగా వాడుతున్నందున 25 కేవీ ఉన్న రైతులు 40 కేవీ, 40 కేవీ రైతులు 60 కేవీ కెపాసిటీ పెంచాలని ఒత్తిడి చేస్తున్నారు. 60 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను వేయించాలంటే రైతులు రూ.5 లక్షల నుంచి రూ.ఏడు లక్షల వరకు ఖర్చు కానుంది. శ్ఙ్రీకేవలం నెల రోజులు మాత్రమే అదనంగా వాడితే దానిని మాత్రమే పరిగణలోకి తీసుకుని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం భావ్యంగా లేదు. కనీసం మూడు నెలల విద్యుత్ సగటు వినియోగాన్ని పరిగణలోకి తీసుకోవాలిశ్రీ అని ఆక్వా రైతులు కోరుతున్నా పట్టించుకునే వారు లేరు. ట్రాన్స్‌ఫార్మర్ల ఒత్తిడి వెనుక కాంట్రాక్టర్లతో విద్యుత్ శాఖ సాధారణ ఉద్యోగి నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు లాలూచీ పడడం కూడా కారణమని ఆక్వా రైతులు విమర్శలు గుప్పిస్తున్నారు.
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు
అదనంగా వినియోగిస్తే వాతే
విద్యుత్ సర్వీస్ పొందిన సమయంలో పొందుతున్న హార్స్ పవర్ కన్నా అదనంగా వినియోగిస్తే రైతుకు బిల్లు మోత మోగుతోంది. అదనపు వినియోగం, దానిపై అసరాధ రుసుం కలిపి సర్వీసుకు రూ.20 వేల నుంచి రూ.60 వేల వరకు విద్యుత్ బిల్లు వస్తోంది. సాధారణంగా చిన్న రైతులు 25 కేవీ, 40 కేవీలు ట్రాన్స్‌ఫార్మర్లను వేయించుకుంటారు. వీళ్లు సాధారణంగా 15 నుంచి 20 కేవీ వరకు వినియోగిస్తుంటారు. చెరువులో రొయ్య పిల్లలు అధికంగా ఉండి కౌంట్ పెరిగిన తరువాత ఏరియేటర్లు ఎక్కువ సమయం వాడుతుంటారు. ఈ సమయంలో విద్యుత్ వాడకం ట్రాన్స్‌ఫార్మర్ కెపాసిటీ కన్నా అదనంగా ఉంటోంది.
దీనిని బూచిగా చూపి ఓవర్ లోడు చార్జీలు, దీనిపై అపరాధ రుసుము వసూలు చేస్తున్నారు. ఇది సర్వీసుకు వచ్చి రూ.10 వేల నుంచి రూ.70 వేల వరకు ఉంటోంది. జిల్లాలో సుమారు 400 మంది సర్వీసులపై అదనపు లోడు కత్తి వేలాడుతోందని అంచనా.
అదనపులోడు
Comments
Please login to add a commentAdd a comment