అదనపు చార్జీలు వసూలు చేయొద్దు
గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులకు జేసీ ఆదేశం
అమలాపురం రూరల్: మార్చి ఒకటో తేదీ నుంచి గ్యాస్ డోర్ డెలివరీలో అదనపు చార్జీలు వసూళ్లు నిలిసివేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులను, డోర్ డెలివరీ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం జిల్లాలో 31 ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు, డెలివరీ సిబ్బందితో గోదావరి భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మేలు చేకూర్చాలనే ప్రధాన సంకల్పంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా దీపం– 2 పథకాన్ని ప్రవేశపెట్టిందని ఇటీవల కాలంలో కోనసీమ జిల్లా ఎల్పీజీ గ్యాస్ వినియోగదారుల నుంచి అదనపు డోర్ డెలివరీ చార్జీలు వసూలు చేస్తున్నారని అన్నారు. జిల్లా నుంచి 70 శాతం మంది నుంచి ఫిర్యాదులు ఐవీఆర్‌ఎస్, వాట్సాప్ క్యూఆర్ కోడ్, ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా వచ్చాయని తెలిపారు. రశీదులో ముద్రించిన సొమ్మును మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేశారు. డోర్ డెలివరీలో అధిక చార్జీలు వసూళ్లపై క్షేత్రస్థాయి తనిఖీల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. అదనపు సొమ్ము వసూలు చేస్తే టోల్ ఫ్రీ 1967కి ఫిర్యాదు చేయవచ్చునన్నారు. పౌరసరఫరాల కమిషనర్ ఆదేశాల పాటించని పక్షంలో సంబంధిత గ్యాస్ డెలివరీ బాయ్స్, పంపిణీదారులపై చర్యలు తీసుకొంటామని తెలిపారు. తూనికలు కొలతల శాఖ కంట్రోలర్ రాజేష్ మాట్లాడుతూ డోర్ డెలివరీ వద్ద సిలిండర్ల తూనికను సీళ్లను పర్యవేక్షిస్తామని కేవలం 150 గ్రాముల వరకు వ్యత్యాసాలను అనుమతిస్తామని ఆపై వ్యత్యాసాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు. జిల్లా పౌర సరఫరాల మేనేజర్ ఎం.బాలసరస్వతి మాట్లాడుతూ గ్యాస్ వినియోగదారులు, వారికిచ్చిన రశీదులో ముద్రించి ఉన్న ధర కంటే అదనంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.
ఉన్నత విద్యకు 10వ తరగతి తొలి మెట్టు
విద్యార్థుల బంగారు భవితకు ప్రాథమిక విద్యా పునాది అని, ఉన్నత విద్యకు 10వ తరగతి తొలి మెట్టని జేసీ నిషాంతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ నిర్ణయించే పదో తరగతి పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొనేలా విద్యార్థులను సన్నద్ధం చేయడంతో పాటు వివిధ సబ్జెక్టుల్లో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్దపెట్టి నూరు శాతం ఫలితాలు సాధిం చేందుకు కృషిచేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రస్తుతం నేర్చుకున్న విషయాలు ఇప్పటి పరీక్షలకే కాకుండా జీవితాంతం ఉపయోగపడతాయని సూచించారు. పరీక్షలకు సుమారు 15 రోజులు వ్యవధి మాత్రమే ఉందని ఈ సమయం ఎంతో కీలక మైనదన్నారు. సబ్జెక్టు ఉపాధ్యాయులు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి బోధించి పరీక్షలను ఎదుర్కొనేందుకు సన్నద్ధం చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment