దొంగ కోడలి పట్టివేత
కాకినాడ క్రైం: అత్త సొత్తు కోసం ఓ కోడలు దొంగగా మారింది. మావయ్య చనిపోతే మొసలు కన్నీళ్లు కారుస్తూ పరామర్శ పేరుతో అత్తగారింట్లో రెక్కీ చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా అక్కడి నుంచి స్వస్థలానికి వెళ్లిపోయి, మళ్లీ తిరిగి వచ్చి ముసుగు దొంగ అవతారంలో ప్రత్యక్షమైంది. అయితేనేం, సీసీ టీవీ ఫుటేజీ, సాంకేతికత పట్టుబడేలా చేశాయి. అత్తారింటిని నిండా ముంచిన కోడలి చోర ప్రావీణ్యాన్ని కాకినాడ సబ్ డివిజన్ ఏఎస్‌పీ దేవరాజ్ మనీష్ సోమవారం నగరంలోని స్థానిక వన్‌టౌన్ పీఎస్‌లో విలేకరులకు వెల్లడించారు.
కాకినాడ జగన్నాథపురం యానాం రోడ్ సమీపంలో ఉండే 74 ఏళ్ల చాగంటి శుక్రవారపు మహాలక్ష్మి భర్త శ్రీరామచంద్రమూర్తి వయో భారంతో కొద్దిరోజుల క్రితం మృతి చెందారు. ఈయన విశ్రాంత ఏపీఎస్పీ అడ్మినిస్ట్రేటర్. ఈ దంపతులకు పిల్లలు లేకపోవడంతో శంకర్ అనే వ్యక్తిని చిన్నప్పుడే దత్తత తీసుకొన్నారు. ఈయన సిర్పూర్–కాగజ్‌నగర్‌లో ఓ సంస్థలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఈయన కొద్ది నెలల క్రితం తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా, మేడిపల్లి మండలం, కట్లకుంట గ్రామానికి చెందిన ధారా రజిత అనే యువతిని కులాంతర వివాహం చేసుకున్నాడు. భార్యతో కలిసి హైదరాబాద్‌లో కాపురం ఉంటున్నాడు. కొద్ది వారాల క్రితం శంకర్ దత్త తండ్రి శ్రీరామచంద్రమూర్తి మృతి చెందారు. మావయ్య చనిపోవడంతో కోడలు అత్తయ్యని పరామర్శించేందుకు వచ్చింది. నెల రోజులకు పైగా అత్తగారింట్లోనే గడిపింది. అనంతరం అక్కడి నుంచి స్వగ్రామానికి వెళ్లిపోయింది. అలా వెళ్లిపోయిన రజితకు అత్తగారింట్లో చూసిన బంగారం, డబ్బుపై దుర్బుద్ధి పుట్టింది. ఎలా అయినా కాజేయాలని కుట్ర పన్నింది. ఈ క్రమంలో తమ బంధువులైన ధారా రఘు(కట్లకుంట గ్రామం), తోందిర్తి లత(రాయలపల్లి గ్రామం, గంగాధర మండలం, కరీంనగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం), తాటి వెంకటేష్(ఇస్లాంపూర్ గ్రామం, గంగాధర మండలం, కరీంనగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం)లతో కలిసి పథక రచన చేసింది. ఈ నెల 14వ తేదీన కాకినాడ వచ్చి అనుకున్నది అనుకున్నట్లు అమలు చేశారు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న వృద్ధురాలిని విచక్షణారహితంగా కొట్టారు. నోట్లో గుడ్డలు కుక్కి చేతులు, కాళ్లు కట్టేశారు. చేతి గాజులు, మెడలో ఉన్న బంగారాన్ని లాక్కున్నారు. ట్రంకు పెట్టెలో ఉన్న రూ.60 వేల నగదును ఎత్తుకెళ్లారు. పరామర్శ సమయంలో తాను చూసిన బంగారం అక్కడ లేకపోవడంతో, మీ ఇంట్లో ఎక్కువ బంగారమే ఉండాలి అదంతా ఏమైందో చెప్పాలని పెద్దామెను చిత్రహింసలకు గురి చేశారు. ఫలితం లేకపోయే సరికి అందిన కాడికి దోచుకొని పరారయ్యారు. ఆ వెంటనే మహాలక్ష్మి కాకినాడ వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. సీఐ నాగదుర్గారావు, సీసీఎస్ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో బృందాలు దొంగలను వెతికే పనిలో పడ్డాయి. సీసీ టీవీ ఫుటేజీలు, సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా మహాలక్ష్మి కోడలు రజిత దొంగతనానికి ఒడిగట్టిందని వెల్లడైంది. బాధితురాలు మహాలక్ష్మి ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషి రామలక్ష్మి ఎప్పటికప్పుడు వీరికి సాయం అందించేదని పోలీసుల విచారణలో తేలింది. దీంతో రజిత సహా ధారా రఘు, తోందిర్తి లత, తాటి వెంకటేష్, రామలక్ష్మిలను పోలీసులు అరెస్టు చేశారు. వారు అన్నమ్మఘాటి సెంటర్‌లో పట్టుబడినట్లు సబ్ డివిజన్ ఏఎస్పీ వెల్లడించారు. వారి నుంచి రూ.2.3 లక్షల నగదు, 9.5 గ్రాముల బంగారు ఆభరణాలు, కారు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఫిర్యాదుదారి ఇంటి నుంచి వీటిలో రూ.60 వేల నగదు, 9.5 గ్రాముల బంగారాన్ని కోడలు ఆమె బృందం ఎత్తుకెళ్లారు. కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన సీసీఎస్ సీఐ క్రాంతి, వన్‌టౌన్ సీఐ నాగదుర్గారావు బృందాన్ని ఏఎస్పీ అభినందించారు.
అత్త సొత్తు కోసం కుతంత్రం
దాడి చేసి బంగారం, సొమ్ము చోరీ
సాంకేతికత సాయంతో
ఆమె అనుచరులు కూడా అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment