ఆటో నుంచి జారిపడి బాలుడి మృతి
ఆదిమూలంవారిపాలెంలో పెళ్లి ఇంట విషాదం
పి.గన్నవరం: స్థానిక అక్విడెక్టుపై సోమవారం సాయంత్రం శివకోడు నుంచి ఆదిమూలంవారిపాలెం వెళుతున్న గూడ్స్ ఆటో గుంతలో పడి డోర్ ఓపెన్ కావడంతో దాని నుంచి జారి కిందపడి నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఆదిమూలంవారిపాలెంలో మార్చి 1న బాలుడి చిన్నాన్న వివాహం జరగాల్సి ఉంది. ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందడంతో పెళ్లి ఇంట విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఊడిమూడి శివారు ఆదిమూలంవారిపాలెంనకు చెందిన చిలకలపూడి శివనాగేంద్ర, అతని తమ్ముడు దైవప్రసాద్ హైదరాబాద్‌లో కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. తమ్ముడు దైవప్రసాద్‌కు వచ్చేనెల 1న వివాహం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నాగేంద్ర భార్య స్వర్ణ, వారి చిన్న కుమారుడు పవన్ శ్రీనివాస్ (4)లు ఇటీవల హైదరాబాద్ నుంచి స్వగ్రామమైన ఆదిమూలంవారిపాలెంనకు వచ్చారు. ఒక పక్క పెళ్లి ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నాగేంద్ర కుటుంబ సభ్యుడు ఒకరు శివకోడు గ్రామంలోని సోదరి ఇంటికి ఆటోలో బయల్దేరాడు. అతనితో పాటు బాలుడు పవన్ శ్రీనివాస్ కూడా మేనత్త ఇంటికి వెళ్లాడు. సాయంత్రం అక్కడి నుంచి తిరిగి వస్తుండగా స్థానిక అక్విడెక్టుపై కుదుపులకు సడన్‌గా ఆటో డోర్ ఓపెన్ అయ్యింది. దీంతో డ్రైవర్ పక్కన కూర్చొన్న బాలుడు అదుపుతప్పి రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. బాలుడిని హుటాహుటిన అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో నాలుగు రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది. అల్లారు ముద్దుగా పెరిగిన పవన్ శ్రీనివాస్‌ను మృత్యువు కాటేయడంతో కుటుంబ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగి పోయారు. బాలుడి తండ్రి నాగేంద్ర హైదరాబాద్ నుంచి బయల్దేరాడు.
అక్రమంగా పశువులను తరలిస్తున్న
లారీ పట్టివేత
కిర్లంపూడి: అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న గూడ్స్ లారీని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్సై జి.సతీష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో కృష్ణవరం టోల్‌ప్లాజా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. వైజాగ్ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళుతున్న గూడ్స్ లారీని తనిఖీ చేయగా దానిలో 72 ఎద్దులను అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. కొత్తవలస, విజయనగరం ప్రాంతాల నుంచి కేరళ రాష్ట్రానికి ఎద్దులను తరలిస్తున్నట్టు విచారణలో తేలింది. దీంతో లారీని సీజ్ చేసి, కేరళకు చెందిన డ్రైవర్ విష్ణుతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. ఎద్దులను గోకవరం మండలం కృష్ణునిపాలెంలోని గోశాలకు అప్పగించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment