కలెక్టర్ షణ్మోహన్
సామర్లకోట/పిఠాపురం: స్థానిక పంచారామ క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామి వారిని మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2.30 గంటల మధ్య దర్శనం చేసుకోవలసి ఉంటుందని కలెక్టర్ షణ్మోహన్ సగిలి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల అధికారుల సమీక్ష సందర్భంగా వీఐపీలు దర్శనానికి వచ్చిన సమయంలో సాధారణ భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారనే ఫిర్యాదుల మేరకు ఆయన ఈ ప్రకటన చేశారు. వీఐపీలు వచ్చిన సమయంలో వారికి దర్శనం చేయించడానికి ఇద్దరు లైజన్ అధికారులు మనోజ్‌కుమార్, బీవీ మోహన్‌రావులను నియమించినట్టు తెలిపారు. పంచారామ క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ మేరకు భక్తుల సహాలు, సూచనలు తీసుకొన్నామన్నారు. ఉచిత దర్శనంతోపాటు, రూ.20, రూ.50, రూ.100 క్యూ లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మహాశివరాత్రి రోజున భక్తులు ఆలయ కోనేరులో పుణ్యస్నానాలు చేసే అవకాశం ఉన్న కారణంగా ప్రమాదాలు జరుగకుండా గజ ఈతగాళ్లను నియమించామన్నారు. 27న రథోత్సవానికి భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు.
పిఠాపురంలో ఇలా..
ఈ నెల 26 న జరిగే మహా శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం దర్శనం నిమిత్తం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. వీఐపీలు 26 వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చని పేర్కొన్నారు. వీఐపీలకు ఇద్దరు లైజన్ అధికారులను నియమించామని తెలిపారు. బి వీర భద్రరావు సెల్ నెంబర్ 9963575998, జోగా సత్యనారాయణ సెల్ నెంబర్ 9948024322 లను సంప్రదించి వీఐపీ దర్శనం చేసుకోవచ్చని సూచించారు. పుష్కరిణి పారిశుధ్య పనుల కోసం అదనంగా వంద మంది పారిశుధ్య సిబ్బందిని నియమించామన్నారు. భక్తుల రక్షణ కోసం చిన్న బోటును, కోనేటి చుట్టూ 24 మంది గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశామన్నారు. మహా శివరాత్రికి వాహనాలపై వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయానికి నలువైపులా కేవలం 500 మీటర్లు దూరంలోనే ఆరు పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment