పోలవరం కాలువ పనుల అడ్డగింపు
బ్రిడ్జి నిర్మించాలని ఆందోళనకారుల డిమాండ్
తుని రూరల్: వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ పోలవరం ఎడమ ప్రధాన కాలువ తవ్వకం పనులను తుని మండలం తాళ్లూరు వద్ద రైతులు, గ్రామస్తులు మంగళవారం అడ్డుకున్నారు. తమ పొలాలకు, ఇళ్లకు వెళ్లేందుకు రహదారి మార్గం లేకుండా కాలువ నిర్మిస్తుండడంతో తాళ్లూరు గ్రామస్తులు ఈ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ, పోలవరం ఎడమ ప్రధాన కాలువ భూ సేకరణలో తమ గ్రామానికి చెందిన 300 ఎకరాలు ఇచ్చామన్నారు. మిగిలిన 400 ఎకరాలు సాగు చేస్తూ బతుకుతున్నామని చెప్పారు. కాలువకు ఓవైపు భూములు, జగనన్న కాలనీ, గ్రామ దేవత గుడి, లక్ష్మీనారాయణ గుడి, మహాత్మా జ్యోతిరావు ఫూలే బాలుర వసతి గృహం(నిర్మాణంలో ఉంది) ఉండగా, మరోవైపు గ్రామమంతా ఉందని వివరించారు. గ్రామస్తులు కాలనీకి, వ్యవసాయ పనుల కోసం పొలాలకు, గుళ్లకు వెళ్లాలన్నా కాలువ దాటుకుని వెళ్లాల్సి ఉందన్నారు. అందుకు అనువుగా వంతెన నిర్మించిన తర్వాతే, పోలవరం కాలువ పనులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. పదేళ్లుగా తమ సమస్యను పట్టించుకోకపోవడంతోనే పనులను అడ్డుకోవాల్సి వచ్చిందన్నారు. తమ సమస్యలను పరిష్కరిస్తేనే, కాలువ పనులకు సహకరిస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో సంఘటన స్థలానికి పోలవరం కాలువ డీఈ మురళీ, ఏఈ డాక్టర్ మహేష్‌కుమార్, ఇతర అధికారులు చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. గ్రామస్తులు, రైతుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని వారు తెలిపారు. స్పష్టమైన హామీ వచ్చే వరకు పనులు చేపట్టవద్దని ఆందోళనకారులు భీష్మించారు. అప్పటికే రాళ్లను పేల్చేందుకు అమర్చిన పేలుడు సామగ్రిని తొలగించడం సాధ్యం కాదని, పేలుళ్లు పూర్తయ్యాక పనులు నిలిపివేస్తామని అధికారులు చెప్పడంతో, ఆందోళనకారులు అంగీకరించి, అక్కడి నుంచి నిష్క్రమించారు.
పోలవరం కాలువ పనుల అడ్డగింపు
Comments
Please login to add a commentAdd a comment