విద్యుదాఘాతంతో యువకుడి మృతి
పెదపూడి: ఆలయం వద్ద విద్యుద్దీపాలంకరణకు సాయం చేస్తున్న యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఉదంతమిది. ఎస్సై రామారావు వివరాల మేరకు, కై కవోలు గ్రామంలో మహా శివరాత్రిని పురస్కరించుకుని మంగళవారం ఉదయం శివాలయం వద్ద విద్యుద్దీపాల అలంకరణ చేస్తున్నారు. ఈ ఏర్పాట్లకు స్థానికుడైన జీకే విశ్వేశ్వరరావు(22) సాయం చేస్తున్నాడు. విద్యుత్ తీగ తగలడంతో అతడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే స్థానికులు అతడిని పెదపూడి సీహెచ్‌సీకి తీసుకెళ్లి, మెరుగైన వైద్యం కోసం కాకినాడ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి తండ్రి చక్రరావు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
క్వార్టర్స్ దశలో హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఆలిండియా సివిల్ సర్వీసెస్ కల్చరల్, స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో కోకనాడ స్పోర్ట్స్ క్లబ్ పర్యవేక్షణలో జరుగుతున్న ఆలిండియా సివిల్ సర్వీస్ హాకీ పోటీలు మంగళవారం క్వార్టర్స్ దశకు చేరాయి. మధ్యప్రదేశ్‌పై సెంట్రల్ సెక్టార్, ఛత్తీస్‌గఢ్‌పై ఆంధ్రప్రదేశ్, కేరళ సెక్టార్‌పై రాజస్థాన్ సెక్టార్ విజయం సాధించాయి. డీఎస్‌డీఓ బి.శ్రీనివాస్‌కుమార్, కోకనాడ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకుడు రవిచంద్ర, అంతర్జాతీయ హాకీ క్రీడాకారుడు దాసరి మురళీకృష్ణ, టోర్నమెంట్ కమిటీ సభ్యులు మ్యాచ్‌లను తిలకించారు.
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
మండపేట: పట్టణంలోని మెహర్‌బాబా స్కూల్ ఎదురుగా ఉన్న పెద్ద కాలువలో సుమారు 35 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు మంగళవారం కనుగొన్నారు. సుమారు 5.6 అడుగుల ఎత్తు ఉన్నాడు. స్కైమన్ అని రాసి ఉన్న నలుపు జీన్స్ ప్యాంట్, పింక్ పొడవు చేతుల గళ్ల చొక్కా మృతదేహానికి ఉన్నాయి. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని సీఐ దారం సురేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment