ఫీల్డ్ ఆపరేటర్ కార్మికుల నిరాహార దీక్ష
● ఓఎన్‌జీసీ రాజమండ్రి అసెట్
కార్యాలయం వద్ద ఆందోళన
● వేతన సవరణ చేయాలని
పీఈయూ నేత సురేష్‌కుమార్ డిమాండ్
రాజమహేంద్రవరం రూరల్: వేతన సవరణ కోసం ఓఎన్‌జీసీ రాజమండ్రి అసెట్‌లో పనిచేస్తున్న 360 మంది ఫీల్డ్ ఆపరేటర్ కార్మికులు ఆందోళన ముమ్మరం చేశారు. యాజమాన్యానికి నోటీసులు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో, మంగళవారం ఓఎన్‌జీసీ రాజమండ్రి అసెట్ కార్యాలయం వద్ద ఆందోళనకు ఉపక్రమించారు. పెట్రోలియం ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రటరీ కొడవటి సురేష్‌కుమార్ సారథ్యంలో కార్మికులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సురేష్‌కుమార్ మాట్లాడుతూ, ఫీల్డ్ ఆపరేటర్ కార్మికులకు ప్రతి నాలుగేళ్లకు వేతన సవరణ జరగాల్సి ఉందన్నారు. 2019కి చివరగా వేతన సవరణ అసంపూర్తిగా జరిగినందున ప్రతి కార్మికునికి రూ.4,050 జీతం తక్కువగా అందుతోందన్నారు. 2023 జనవరి ఒకటి నుంచి కొత్త వేతన సవరణ జరగాల్సి ఉందన్నారు. దీనిపై యాజమాన్యం నుంచి ఎటువంటి ఫలితం లేకపోవడంతో, ఈ ఏడాది జనవరిలో యాజమాన్యానికి నోటీసులు అందజేశామన్నారు. యాజమాన్యం కొంత సమయం కోరడంతో ఇప్పటివరకు సంయమనం పాటించామన్నారు. పరిస్థితుల్లో మార్పు లేకపోవడంతో నిరహార దీక్ష చేపట్టాల్సి వచ్చిందన్నారు. వేతన సవరణతో పాటు, ఇతర కార్మిక డిమాండ్లపై మంగళవారం సాయంత్రం యాజమాన్యానికి నిరవధిక సమ్మె నోటీసు అందజేశామని సురేష్‌కుమార్ తెలిపారు. బుధవారం నుంచి దశలవారీగా నిరసనలు తెలుపుతూ, మార్చి 12 నుంచి నిరవధిక సమ్మె చేపట్టాలని నిర్ణయించామన్నారు. యూనియన్ రాజమండ్రి అసెట్ జనరల్ సెక్రటరీ జి.ప్రశాంత్‌కుమార్, ఇతర కార్మిక ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment