లారీ ఢీకొని యువకుడి మృతి
నక్కపల్లి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా సమీపంలో జాతీయ రహదారిపై బైక్‌ను లారీ ఢీకొనడంతో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల వివరాల మేరకు, కాకినాడ జిల్లా గొల్లప్రోలుకు చెందిన చిక్కాల శ్యామ్‌ప్రసాద్(29) వేంపాడు సమీపంలో సుబి ఇన్‌ఫ్రా ఫ్యాబ్రికేషన్ వర్క్ షాపులో పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి తన స్నేహితుడితో కలిసి బైక్‌పై టోల్ ప్లాజా వద్ద టీ పాయింట్‌కు వెళ్తుండగా, వెనుక నుంచి లారీ ఢీకొంది. బైక్ నడుపుతున్న శ్యామ్‌ప్రసాద్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న స్నేహితుడు సాయిబాబాకు గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోలీసులు నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సన్నిబాబు తెలిపారు.
ఆలయంలో కానుకల చోరీ కేసులో జైలు
తిరుత్తణి: ఆలయంలో వినూత్నంగా కానుకలు చోరీ చేసిన వ్యక్తికి ఆరేళ్ల జైలు శిక్షను విధిస్తూ తిరుత్తణి కోర్టు తీర్పు వెలువరించింది. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో గతేడాది ఏప్రిల్‌లో కొండ ఆలయ హుండీల్లో భక్తులు చెల్లించే కానుకలను ఓ వ్యక్తి నూలు సంచిలో పడేలా హుండీ లోపలి భాగంలో ఏర్పాటు చేస్తున్నట్టు సీసీ కెమెరాల్లో ఆలయ అధికారులు గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుత్తణి పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం సిద్యాలయ గ్రామానికి చెందిన జేమ్స్ శ్యామ్‌వేల్‌ను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. తిరుత్తణి క్రిమినల్ కోర్టులో జరిగిన కేసు విచారణలో నేరం రుజువైంది. నిందితుడికి ఆరేళ్ల పాటు జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ముత్తురాజ్ తీర్పు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment