మెహబూబ్ సిస్టర్స్‌కు పతకాల పంట
అమలాపురం టౌన్: అమలాపురానికి చెందిన మెహబూబ్ సిస్టర్స్ షహీరా, షకీలా మరో మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో బంగారు, వెండి పతకాలు కై వసం చేసుకున్నారు. ఈ నెల 7, 8, 9 తేదీల్లో అనంతపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో మెహబూబ్ సిస్టర్స్ చెరో మూడు బంగారు పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా మాస్టర్స్ గేమ్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో హైదదాబాద్ జింఖానా గ్రౌండ్స్‌లో ఈ నెల 23న జరిగిన ఏడో మాస్టర్ గేమ్స్ తెలంగాణ స్టేట్ చాంపియన్‌షిప్–2025లో సైతం మెహబూబ్ సిస్టర్స్ 4 బంగారు, రెండు వెండి పతకాలు కై వసం చేసుకున్నారు. దేశంలో ఎక్కడ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు జరిగినా, దూరాభారం, వ్యయప్రయాసలు లెక్కచేయకుండా వెళ్లి పతకాలు కొల్లగొట్టడం ఈ సిస్టర్స్‌కు నాలుగు దశాబ్దాలుగా వెన్నతో పెట్టిన విద్య. ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా పేరుతో జరిగిన పోటీల్లోనూ మెహబూబ్ సిస్టర్స్ సత్తా చాటి పతకాలు సాధించడమే కాకుండా, జాతీయ పోటీలకు సైతం అర్హత సాధించారు. ఏప్రిల్ నాలుగో వారంలో హిమాచల్ ప్రదేశ్ జరగనున్న జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గోనున్నారు. హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర చాంపియన్‌షిప్ పోటీల్లో 75ప్లస్ విభాగంలో షహీరా లాంగ్ జంప్, 200 మీటర్ల పరుగులో ప్రథమ స్థానాల్లో నిలిచి రెండు బంగారు పతకాలు, వంద మీటర్ల పరుగులో ద్వితీయ స్థానాన్ని సాధించి వెండి పతకాన్ని గెలిచారు. అలాగే 65ప్లస్ విభాగంలో షకీలా లాంగ్ జంప్, వంద మీటర్ల పరుగులో ప్రథమ స్థానాలు పొంది బంగారు పతకాలను, డిస్కస్ త్రోలో ద్వితీయ స్థానం పొంది వెండి పతకాన్ని కై వసం చేసుకున్నారు. పతకాలతో పాటు, మెరిట్ సర్టిఫికెట్లూ అందుకున్నారు. ఆయా పోటీల్లో బంగారు, వెండి పతకాలు సాధించి, మంగళవారం అమలాపురానికి చేరుకున్న మెహబూబ్ సిస్టర్స్‌కు క్రీడాకారులు, వాకర్లు అభినందనలు తెలిపారు.
ఎన్నికల సిబ్బందికి
పోస్టల్ బ్యాలెట్ పత్రాలు
అమలాపురం రూరల్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ పత్రాలను పోస్ట్ ద్వారా వారి చిరునామాలకు పంపించామని కలెక్టర్ మహేష్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారు పోస్టల్ బ్యాలెట్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఏలూరు కలెక్టర్‌కు మార్చి 3న ఉదయం 7.59లోగా పోస్ట్ లేదా స్వయంగా అందేలా పంపాలన్నారు. ఫారం–13 డిక్లరేషన్‌లో బ్యాలెట్ పేపర్ వరుస సంఖ్య, వారి సంతకం, చిరునామాతో పాటు, డిక్లరేషన్‌పై గెజిటెడ్ అధికారి సంతకం చేయించాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ పత్రాలపై ప్రాధాన్య క్రమంలో పెన్నుతో అంకెలను వేయాలని, టిక్ పెట్టరాదన్నారు. పోస్టల్ బ్యాలెట్ పేపర్ అని రాసిన కవర్‌లో ఫారం ఉంచి, కవరును రిటర్నింగ్ అధికారికి పంపాలన్నారు. వ్యాపార, వాణిజ్య, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఓటర్లకు ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment