
విశాఖ లా యూనివర్సిటీలో సంజీవయ్య కాంస్య విగ్రహం
● ఆగస్టులో స్నాతకోత్సవం
సందర్భంగా ఆవిష్కరణ
● కొత్తపేట వుడయార్
శిల్పశాలలో రూపకల్పన
కొత్తపేట: విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (లా యూనివర్సిటీ)లో మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య కాంస్య విగ్రహాన్ని నెలకొల్పనున్నారు. దీని తయారీ బాధ్యతను కొత్తపేటకు చెందిన అంతర్జాతీయ శిల్పి డి.రాజ్‌కుమార్ వుడయార్‌కు అప్పగించారు. ఆయన ఇప్పటికే సంజీవయ్య నమూనా విగ్రహం రూపొందించారు. దీనిని యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ (వీసీ) ప్రొఫెసర్ డి.సూర్యప్రకాశరావు, సంజీవయ్య అన్న కుమారుడు, దామోదరం సంజీవయ్య స్మారక సంస్థ చైర్మన్ దామోదరం రంగయ్య శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వీసీ సూర్యప్రకాశరావు విలేకర్లతో మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా 2008లో నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విశాఖ ఎంవీపీ కాలనీలో లా యూనివర్సిటీని ప్రారంభించారని తెలిపారు. దీనికి అనుబంధంగా రాయలసీమకు సంబంధించి కడప, తెలంగాణకు సంబంధించి నిజామాబాద్‌లో బ్రాంచ్ యూనివర్సిటీలను ఏర్పాటు చేశారన్నారు. తరువాత ఈ రెండు బ్రాంచ్‌లు తీసివేయగా విశాఖ లా యూనివర్సిటీ బలోపేతమైందన్నారు. ఏపీ లా యూనివర్సిటీకి దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీగా పేరు పెట్టాలని 2013లో అప్పటి ఏపీ శాసన మండలి చైర్మన్, సంజీవయ్య శిష్యుడు అప్పనబోయిన చక్రపాణి ప్రతిపాదించారని, దీనిని ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు. 2022 ఫిబ్రవరి 14న సంజీవయ్య శత జయంతి వేడుకల సందర్భంగా ఆయన విగ్రహం నెలకొల్పాలని సంజీవయ్య స్మారక సంస్థ చైర్మన్ దామోదరం రంగయ్య ప్రతిపాదించారని, దీంతోపాటు మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలు కూడా నెలకొల్పాలని యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ తీర్మానించిందని వివరించారు. ఆ మేరకు 10 అడుగుల కాంస్య విగ్రహాలు తయారు చేయాల్సిందిగా శిల్పి రాజ్‌కుమార్‌కు ఆర్డర్ ఇచ్చామన్నారు. విగ్రహాలు జీవకళతో ఉట్టి పడుతున్నాయన్నారు. ఆగస్టు మొదటి వారంలో వర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి పి.శ్రీనరసింహ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఽయూనివర్సిటీ చాన్స్‌లర్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి చేతుల మీదుగా విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చేస్తున్నామని వీసీ తెలిపారు. కార్యక్రమంలో లా యూనివర్సిటీ ప్రొఫెసర్ దాసరి సుజాత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment