
రైల్వే లైన్ పనులు వేగవంతం చేయండి
అమలాపురం రూరల్: జిల్లా ప్రజల చిరకాల వాంఛ కోటిపల్లి – నరసాపురం రైల్వే లైన్ పనులను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి అధికారులను ఆదేశించారు. శనివారం అమలాపురం కలెక్టరేట్‌లో రైల్వే, రెవెన్యూ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. రైల్వే లైన్ ఏర్పాటులో భూసేకరణ నష్ట పరిహారం చెల్లింపు, నష్ట పరిహారం పెంపుపై తీసుకున్న చర్యలు, నూతన అలైన్‌మెంట్, ట్రాఫిక్ సర్వే తదితర అంశాలపై సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ రైల్వే ఇంజినీర్లు, రెవెన్యూ అధికారుల సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఇప్పటికే రైల్వే లైన్ ఏర్పాటులో భాగంగా భూసేకరణ పూర్తయిన ప్రాంతాల్లోని భూమిని రైల్వే అధికారులు స్వాధీన పరుచుకుని పనులను చేపట్టాలన్నారు. అయినవిల్లి, అమలాపురం రూరల్ మండల గ్రామాల్లో రైల్వే లైనుకు సంబంధించి భూసేకరణ పూర్తయ్యిందన్నారు. ఆ భూములను సర్వే చేసి హద్దులను సూచిస్తూ రైల్వే అధికారులకు అప్పగించాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. కోటిపల్లి–నరసాపురం రైల్వే లైన్ పనుల్లో ఉత్పన్నమైన వివిధ సమస్యలను అధికారులు సమన్వయంతో దశల వారీగా అధిగమించాలన్నారు. సమావేశంలో రైల్వే శాఖ చీఫ్ ఇంజినీర్ కె.సూర్యనారాయణ, డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ ఎ.బద్దయ్య, సహాయ కార్య నిర్వాహక ఇంజినీర్ పి.అర్జున్‌రావు, డీఆర్వో బీఎల్‌ఎన్ రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment