కాశీ స్ఫూర్తి కొనసాగాలి
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు విశ్వరూప్
● అంతర్జాతీయ క్రీడాకారుడు
సాత్విక్‌కు పరామర్శ
అమలాపురం టౌన్: తన తనయుడు సాత్విక్ సాయిరాజ్‌ను అంతర్జాతీయ క్రీడాకారుడిగా తయారు చేసి జిల్లా గర్వించేలా శ్రమించిన క్రీడాభిమాని, జాతీయ షటిల్ బ్యాడ్మింటన్ రిఫరీ రంకిరెడ్డి కాశీ విశ్వనాథం మృతి క్రీడా రంగానికే తీరని లోటని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పినిపే విశ్వరూప్ అన్నారు. తండ్రి మరణంతో విషాదంలో ఉన్న దివంగత కాశీ తనయులు అంతర్జాతీయ క్రీడాకారుడు సాయిరాజ్ సాత్విక్, రామ్ చరణ్‌లను ఆయన ఆదివారం పరామర్శించారు. స్థానిక ముమ్మిడివరం గేటు సెంటరులో గల కాశీ కుటుంబ సభ్యులను విశ్వరూప్ కలిసి ఓదార్చారు. కాశీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విశ్వరూప్ సాయిరాజ్ సాత్విక్‌తో కొద్దిసేపు మాట్లాడారు. తండ్రి క్రీడా స్ఫూర్తిని పుణికి పుచ్చుకుని, ఆయన క్రీడా ఆశయాలను మరింత నెరవేర్చేలా శ్రమించాలని పేర్కొన్నారు. విశ్వరూప్‌తో పాటు పార్టీ నాయకులు కల్వకొలను బాబి, కల్వకొలను ఉమ తదితరులు ఉన్నారు.
కొత్త అల్లుడికి
కోనసీమ మర్యాదలు
29 వంటకాలతో విందు భోజనం
అమలాపురం టౌన్: అత్తింటికి వచ్చిన ఓ అల్లుడికి ఆ కుటుంబ సభ్యులు కోనసీమ మర్యాదలు రుచి చూపించారు. ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి యర్రమల్లు వంశీకి ఇటీవల అమలాపురం పట్టణం శ్రీరామపురానికి చెందిన ప్రత్యూషతో వివాహమైంది. వంశీ ఆదివారం అమలాపురంలోని తన అత్తవారింటికి రావడంతో మధ్యాహ్నం 29 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. కొత్త దంపతులిద్దరికీ సంప్రదాయబద్ధంగా ఒకే అరిటాకులో ఆ పదార్థాలన్నీ వడ్డించగా వంశీ, ప్రత్యూష ఆ విందు ఆరగించారు. కొత్త జంటకు భోజనంలో బిర్యానీ, పులిహోర, ఉల్లి చట్నీ, పన్నీర్ కర్రీ, ములక్కాడ, టమాటా కర్రీ, ఆనపకాయ కూర, చామదుంపల పులుసు, సాంబారు, దోసకాయ పప్పు, ఆవకాయ, శనగ పొడుం, కొబ్బరి కాయ పచ్చడి, పెరుగు, బొబ్బట్లు, చక్కెర పొంగలి, జున్ను, కాజా, పూరి, పాలకోవా, ఉండ్రాళ్లు, సేమియా, లడ్డూలు, బాదంగీర్, కూల్ డ్రింక్, ఫ్రూట్ సలాడ్ ఇలా అనేక రుచులతో వడ్డించారు. శ్రీరామపురానికి చెందిన తుమ్మూరి వీర వెంకట సత్యనారాయణ (మామ), ఉమా శ్రీదేవి (అత్త) దంపతులు తమ అల్లుడికి దగ్గరుండి ఈ విందు వడ్డించారు.
ప్రజా ఫిర్యాదుల
పరిష్కార వేదిక రద్దు
అమలాపురం రూరల్: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల ప్రవర్తన నియమావళి ముగిసే వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వ హించడం లేదని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (మీకోసం), మండల కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించడం లేదని తెలిపారు. కేవలం గ్రామ సచివాలయాలలో మాత్రమే ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
అయినవిల్లికి పోటెత్తిన భక్తులు
అయినవిల్లి: సంకటహర చతుర్థి సందర్భంగా ఆదివారం అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి వారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని పూజలు చేయించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వామికి మేలుకొలుపు, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, లక్ష్మీగణపతి హోమం, గరిక పూజ నిర్వహించారు. ఆదివారం ఒక్క రోజు స్వామివారికి వివిధ పూజ టిక్కెట్లు, అన్నదాన విరాళాల ద్వారా రూ.2,70,660 ఆదాయం లభించినట్లు ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.
కాశీ స్ఫూర్తి కొనసాగాలి
Comments
Please login to add a commentAdd a comment