
పదవుల కోసం ముందుకు..
●
● మార్కెట్ కమిటీలపైనే ఆశలు
● నెలాఖరుకు భర్తీ చేస్తామన్న చంద్రబాబు
● మొదలైన కూటమి నేతల పైరవీలు
● టీడీపీ, జనసేన సిగపట్లు
సాక్షి, అమలాపురం: నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంతో ఆశావహులు ముందుకు వస్తున్నారు. ప్రధానంగా మార్కెట్ యార్డు పదవులపై జిల్లాలో కీలక నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఈ పదవుల పందేరం కూటమి పార్టీల్లో కొత్త విభేదాలకు దారితీయనుంది.
ఈ నెలాఖరు నాటికి నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలో ఎమ్మెల్యే తరువాత ప్రోటోకాల్ పరంగా ఇంచుమించి నియోజకవర్గం అంతా ప్రతిబింబించే మార్కెట్ కమిటీలపై ద్వితీయ శ్రేణి నేతలు అధికంగా ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా శాసన మండలి ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జిల్లాలో తొమ్మిది వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. పి.గన్నవరం, కొత్తపేట నియోజకవర్గానికి మాత్రం రెండు చొప్పున, మిగిలిన నియోజకవర్గాల్లో ఒకటి చొప్పున ఏఎంసీలు ఉన్నాయి. అంబాజీపేట, నగరం, కొత్తపేట, ఆలమూరు, ముమ్మిడివరం, రాజోలు, రామచంద్రపురం మార్కెట్ కమిటీలు ఆదాయ పరంగా, సదుపాయాల విషయాల్లో ముందున్నాయి. పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల ముందు మార్కెట్ యార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అప్పటి రిజర్వేషన్ ప్రకారం కొత్తపేట (బీసీ జనరల్), అంబాజీపేట (ఓసీ జనరల్), రామచంద్రపురం (ఓసీ జనరల్), అమలాపురం (ఓసీ మహిళ), ముమ్మిడివరం (ఓసీ జనరల్), రాజోలు (బీసీ మహిళ), నగరం (ఎస్సీ మహిళ), మండపేట (బీసీ జనరల్), ఆలమూరు (ఓసీ మహిళ) రిజర్వ్ అయ్యింది. అయితే ఈ రిజర్వేషన్లు మారే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ఈ రిజర్వేషన్లను బట్టి ఇప్పటికే కొన్ని మార్కెట్ యార్డులకు చైర్మన్‌లను స్థానిక ఎమ్మెల్యేలు ఎంపిక చేసినట్టు తెలిసింది.
చిచ్చు రేపేలా..
కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పందేరం భాగస్వామ్య పార్టీల మధ్య చిచ్చు రేపుతోంది. ఈ పదవులకు టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు పోటీ పడుతున్నారు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్నచోట తమకు అవకాశం ఇవ్వాలని టీడీపీ నాయకులు పట్టుబడుతున్నారు. ఇదే సమయంలో తమ నియోజకవర్గాల్లో జనసేనకు అవకాశం ఇచ్చేందుకు సుముఖత చూపడం లేదు. దీంతో జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారి కార్యక్రమాలను బాయ్‌కాట్ చేస్తున్నారు. తమ గోడును పార్టీ అగ్రనేతలకు మొర పెట్టుకుంటున్నారు. అయినా టీడీపీ ఎమ్మెల్యేలు ఖాతరు చేయడం లేదు. తమ పార్టీ వారినే ఏఎంసీ చైర్మన్‌లుగా ఎంపిక చేస్తున్నారు.
ఎక్కడెక్కడ ఎలా అంటే..
ముమ్మిడివరంలో టీడీపీకి చెందిన తాడి నరసింహారావుకు దాదాపు ఖరారైనట్టు సమాచారం. అలాగే అమలాపురానికి టీడీపీకి చెందిన జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు అధికారి జయ వెంకటలక్ష్మిలకు ఖరారైనట్టు తెలిసింది. రామచంద్రపురం ఏఎంసీ చైర్మన్ పదవికి సైతం రెండు పార్టీలు పట్టుబడుతున్నాయి. టీడీపీ నుంచి కడియాల రాఘవన్, రావిపాటి వెంకట గణేష్‌చౌదరి, జనసేన నుంచి ముప్పాళ్ల గణేష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మంత్రి వాసంశెట్టి సుభాష్ మాత్రం టీడీపీకి మొగ్గు చూపుతున్నారు. మండపేట ఏఎంసీ పదవి సైతం స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తన పార్టీకి చెందిన కాపు, బీసీ సామాజికవర్గానికి ఇచ్చే అవకాశముంది. కొత్తపేట ఏఎంసీ చైర్మన్ పదవిని టీడీపీ నుంచి జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రెడ్డి రామకృష్ణ, రావులపాలెం మండల టీడీపీ అధ్యక్షుడు గుత్తుల పట్టాభిరామయ్య ఆశించారు. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మొగ్గు పట్టాభిరామయ్యపై ఉన్నట్టు తెలిసింది. ఇదే నియోజకవర్గంలో ఉన్న ఆలమూరు ఏఎంసీ చైర్మన్ జనరల్ మహిళకు కేటాయించగా జనసేన పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ కొత్తపల్లి వెంకటలక్ష్మికి అవకాశం వస్తోందనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే ఉన్నచోట రెండు ఏఎంసీలలో ఒక్కటి మాత్రమే జనసేనకు దక్కుతోంది. జనసేన ఎమ్మెల్యేలున్న రాజోలు నియోజకవర్గం పరిధిలోని రాజోలు ఏఎంసీ చైర్మన్ పదవి జనసేన నేత గబ్బుల ఫణికుమార్ పేరు దాదాపు ఖరారైనట్టు తెలిసింది.
కాక రేపుతున్న అంబాజీపేట ఏఎంసీ
జిల్లాలో అంబాజీపేట ఏఎంసీ చైర్మన్ పదవి ఉత్కంఠ రేపుతోంది. పి.గన్నవరం నియోజకవర్గం పరిధిలో అంబాజీపేటతోపాటు, నగరం మార్కెట్ కమిటీ ఉంది. అంబాజీపేట ఓసీ జనరల్ కాగా, నగరం ఎస్సీ మహిళ అయ్యింది. నగరం జనసేనకు ఇస్తే అంబాజీపేట టీడీపీకి ఇస్తారని తొలుత ప్రచారం జరిగింది. టీడీపీ నుంచి అయినవిల్లి మండలానికి చెందిన టీడీపీ అనుకూల కమ్మ సామాజికవర్గానికి చెందిన నాయకుడికి లేదా క్షత్రియ సామాజికవర్గానికి చెందిన వారిలో ఒకరికి ఈ పదవి దక్కుతోందని బలమైన ప్రచారం జరుగుతోంది. కమ్మ సామాజికవర్గం నేత లోకేష్ కోటరీకి చెందిన వారు కావడంతో అతనికే పదవి దాదాపుగా ఖరారైనట్టు ప్రచారం సాగుతోంది. నగరానికి సంబంధించిన జనసేన ఎస్సీ మహిళల తరఫున పెనుమాల లక్ష్మీ ఒక్కరే రేసులో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే అంబాజీపేట జనసేనకు ఇవ్వాలని, తొలి నుంచి ఆ పార్టీకి కొమ్ముకాస్తున్న కాపు సామాజికవర్గం నుంచి అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణపై ఒత్తిడి అధికంగా వస్తోంది. జనసేనకు సొంత సొమ్ము ఖర్చు పెట్టిన వారిని ఇప్పుడు దూరం పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. జనసేన నుంచి ఈ పదవి ఆశిస్తున్న కొర్లపాటి గోపి, మహిపాల తాతాజీలిద్దరూ అంబాజీపేటకు చెందినవారే కావడం గమనార్హం. ఎమ్మెల్యే కనుక ఈ ఒత్తిడికి తలొగ్గితే ఆ ప్రభావం నగరం మార్కెట్ కమిటీపై పడనుంది.
అంబాజీపేట మార్కెట్ యార్డు కార్యాలయం
అల్లవరం మార్కెట్ యార్డు కార్యాలయం

పదవుల కోసం ముందుకు..
Comments
Please login to add a commentAdd a comment