
కామన్వెల్త్ క్షయ నివారణ కమిటీ సభ్యుడిగా శర్మ
అమలాపురం రూరల్: 56 దేశాల సభ్యత్వం కలిగిన కామన్వెల్త్ మెడికల్ అసోసియేషన్‌లో క్షయ వ్యాధి నివారణ కోసం 12 మంది సభ్యులతో ఏర్పాటైన ఉప సంఘంలో దేశం నుంచి ముగ్గురు డాక్టర్లను ఎంపిక చేశారని, ఇందులో జిల్లా నుంచి డాక్టర్ పీఎస్ శర్మ సభ్యునిగా ఉండడం అభినందనీయమని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. సోమవారం అమలాపురంలోని కలెక్టర్ చాంబర్‌లో క్షయ వ్యాధి అపోహల నిర్మూలన గురించి ముద్రించిన ముద్రికను కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయ వ్యాధి నిర్మూలన ఉప సంఘంలో అమలాపురానికి చెందిన డాక్టర్ శర్మకు అవకాశం లభించడం హర్షణీయమన్నారు. క్షయ వ్యాధి నివారణ అందరి బాధ్యత అని, ప్రతి పౌరుడు తమ వంతు కృషి చేయాలని తెలిపారు. ఈ నెల 17న కలెక్టరేట్ ప్రాంగణంలో క్షయ వ్యాధి నిర్మూలన గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామని డాక్టర్ పీఎస్ శర్మ తెలిపారు. క్షయ వ్యాధిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు
డీఐఈఓ సోమశేఖరరావు
అమలాపురం టౌన్: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు రెండు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, మూడు సిటింగ్ స్క్వాడ్‌లు, కస్టోడియన్స్ పర్యవేక్షణలో పకడ్బందీగా జరుగుతున్నాయని డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (డీఐఈఓ) వనుము సోమశేఖరరావు తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులకు తెలుగు, హిందీ, సంస్కృతం పరీక్షలు, ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులకు జనరల్ ఫౌండేషన్ కోర్సులకు సోమవారం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు. జనరల్ ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి జిల్లాలో మొత్తం 10,028 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 9,705 మంది హాజరయ్యారని చెప్పారు. 323 మంది గైర్హాజరయ్యారన్నారు. అదే ఒకేషనల్ ఇంటర్ పరీక్షలకు 2,348 మంది హాజరు కావాల్సి ఉండగా, 2,197 మంది పరీక్షలు రాశారన్నారు. జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్, సిటింగ్ స్క్వాడ్‌లతో పాటు డీఐఈఓ సోమశేఖరరావు, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు తనిఖీ చేశారు.
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ
ఎమ్మెల్సీ గెలుపుపై హర్షం
అమలాపురం టౌన్: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్‌టీయూ, మిత్ర సంఘాలు బలపరిచిన గాదె శ్రీనివాసుల నాయుడు గెలుపుపై పీఆర్‌టీయూ జిల్లా శాఖ హర్షం వ్యక్తం చేసింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గతంలో రెండుసార్లు ఎన్నికై న శ్రీనివాసుల నాయుడు ఆ అనుభవంతోనే గెలిచారని, ఇక ముందు కూడా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని పీఆర్‌టీయూ జిల్లా శాఖ అధ్యక్షుడు నరాల కృష్ణకుమార్, ప్రధాన కార్యదర్శి దీపాటి సురేష్ బాబు అన్నారు. ఈ మేరకు వీరు అమలాపురంలో సోమవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. వీరితోపాటు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మొంగం అమృతరావు కూడా శ్రీనివాసుల నాయుడికి అభినందనలు తెలిపారు.
ధర్మ పరిరక్షణలో
భాగస్వాములు కావాలి
తుని: జీవాత్మకు పరమాత్మను అనుసంధానం చేసేదే ధర్మమని, ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య, ఆధ్మాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని కహెన్ షా వలీ దర్గాలో సోమవారం జరిగిన 28వ వార్షిక సర్వధర్మ సమ్మేళన సభకు ఆయన అధ్యక్షత వహించారు. సికింద్రాబాద్ యోగాలయ నిర్వహకుడు డాక్టర్ వాసిలి వసంత్ కుమార్, హిందూ ధర్మ ప్రతినిధి స్వామి విజయానంద, ఇస్లాం ప్రతినిధి సూఫీ షేక్ అహ్మద్ జానీ, క్రైస్తవ ప్రతినిధి ఎస్.బాలశౌరి, బౌద్ధం ప్రతినిధి పూజ్య భంతే, సిక్కు మత ప్రతినిధి గురుచరణ్ సింగ్‌తో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి, సమ్మేళనాన్ని ప్రారంభించారు.

కామన్వెల్త్ క్షయ నివారణ కమిటీ సభ్యుడిగా శర్మ
Comments
Please login to add a commentAdd a comment