
‘పది’ పరీక్షల్లో ప్రథమ స్థానంలో నిలపండి
అమలాపురం రూరల్: ఉన్నత విద్యకు పదో తరగతి తొలిమెట్టని, ఈ పరీక్షల్లో విద్యార్థులు నూరు శాతం సాధించి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని జిల్లా రెవెన్యూ అధికారి బీఎల్‌ఎన్ రాజకుమారి తెలిపారు. సోమవారం అమలాపురంలోని డీఆర్వో చాంబర్‌లో 10వ తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లా విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్చి 17 నుంచి నిర్వహించే పదో తరగతి పరీక్షల్లో 19,217 విద్యార్థుల కోసం 110 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. పరీక్షలంటే విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టి, వారిలో స్ఫూర్తిని నింపాలన్నారు. ప్రఽథమ స్థానం సాధించేలా సమాయత్తం చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.
ఈ పరీక్షలకు 13 రోజులు మాత్రమే ఉందని, ఎటువంటి భయాందోళనకు గురికాకుండా ఉపాధ్యాయులు ఇచ్చిన సూచనలు విద్యార్థులు పాటిస్తే తప్పకుండా ఉత్తీర్ణత సాధిస్తారని తెలిపారు. ఇంజినీర్, డాక్టర్, కలెక్టర్ తదితర ఉద్యోగాలకు ముందు మెట్టు పదో తరగతి ఉత్తీర్ణతేనని, వీటిలో మంచి మార్కులు సాధిస్తే భవిష్యత్తులో కోరుకున్న ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుందన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి నూరు శాతం ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. సమావేశంలో డీఈఓ షేక్ సలీం బాషా, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్ బి.హనుమంతరావు, ఉప విద్యాశాఖ అధికారి జి.సూర్యప్రకాశం, పోస్టల్, ఆర్టీసీ ట్రాన్స్‌కో అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment