
రత్నగిరిపై కనకవర్షం
● సత్యదేవునికి రికార్డు
స్థాయి ఆదాయం
● 30 రోజులకు హుండీల ద్వారా రూ.1.89 కోట్ల రాబడి
అన్నవరం: మాఘ మాసం పుణ్యమా అని రత్నగిరిపై కనకవర్షం కురిసింది. గడచిన 30 రోజులకు గాను అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి హుండీల ద్వారా రికార్డు స్థాయిలో రూ. 1,88,91,940 ఆదాయం సమకూరింది. దేవస్థానంలోని హుండీలను సోమవారం తెరచి, భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. నగదు రూ. 1,80,63,749, చిల్లర నాణేలు రూ.8,28,191 వచ్చా యని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సు బ్బారావు తెలిపారు. వీటితో పాటు బంగారం 66.010 గ్రాములు, వెండి 693 గ్రాములు వచ్చాయని చెప్పారు.
విదేశీ కరెన్సీ
హుండీల ద్వారా సత్యదేవునికి పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ కూడా లభించింది. అమెరికన్ డాలర్లు 129, సింగపూర్ డాలర్లు 50, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ దీనార్ 21, ఇంగ్లండ్ పౌండ్లు 10, ఖతార్ రియల్స్ 28, ఆస్ట్రేలియా డాలర్లు 25, యూఏఈ దీరామ్స్ 530, యూరోలు 5, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ బైసా 100, మలేషియా రింగిట్స్ 6 లభించాయి.
కలిసొచ్చిన మాఘం
గడచిన మాఘ మాసంలో రత్నగిరిపై పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. అలాగే ఫాల్గుణ మాసంలో కూడా గత మూడు రోజులుగా రత్నగిరిపై జోరుగా వివాహాలు జరుగుతున్నాయి. ఇతర ప్రాంతాల్లో వివాహాలు చేసుకున్న వారు కూడా అధిక సంఖ్యలో సత్యదేవుని ఆలయానికి తరలి వస్తున్నారు. అలాగే, గత నెలలో భీష్మ ఏకాదశి సందర్భంగా సుమారు లక్ష మంది భక్తులు సత్యదేవుని దర్శనానికి వచ్చారు. ఇలా వచ్చిన భక్తులందరూ పెద్ద మొత్తంలో హుండీల్లో కానుకలు సమర్పించారు. దీంతో రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చిందని, హుండీల ద్వారా రోజుకు సగటున రూ.6,09,412 రాబడి వచ్చిందని చైర్మన్, ఈఓ తెలిపారు. హుండీల ఆదాయం లెక్కింపులో పలు స్వచ్ఛంద సంస్థల సిబ్బంది పాల్గొన్నారు. వచ్చిన నగదును స్థానిక స్టేట్ బ్యాంకుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment