
తాగునీటి ఎద్దడి రాకుండా చూడండి
అధికారులతో కలెక్టర్
మహేష్ కుమార్
అమలాపురం రూరల్: వేసవి దృష్ట్యా జిల్లాలో తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. సోమవారం అమలాపురంలోని కలెక్టరేట్‌లో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజినీర్లు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. వేసవి తాగునీటి ప్రణాళికలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో తాగునీటి వనరుల సమస్య లేకుండా వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. శివారు గ్రామాలకు నీటి సమస్య ఉంటే ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కృష్ణారెడ్డి, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య విభాగం ఇంజినీర్లు, మున్సిపల్ కమిషనర్లు వీఐపీ నాయుడు, కేవీఆర్ రాజు, టీవీ రంగారావు, రవివర్మ పాల్గొన్నారు.
జియో మ్యాట్ల వినియోగం పెంచాలి
బీటీ, సీసీ రోడ్లు, కాలువ గట్ల నిర్మాణాల్లో భూమి దిగువకు జారిపోయే చోట జియో టెక్స్‌టైల్స్ మ్యాట్ల వినియోగం పెంచాలని కలెక్టర్ మహేష్‌కుమార్ ఆదేశించారు. కలెక్టర్ చాంబర్‌లో పంచాయతీరాజ్, రహదారులు భవనాల శాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులు, ఇంజినీర్లతో సమావేశం నిర్వహించారు. జియో టెక్స్‌టైల్స్, జియో సింథటిక్ పేపర్ ద్వారా రోడ్ల నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో అంచనాలు రూపొందించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పీకేపీ ప్రసాద్, పంచాయతీ రాజ్ ఎస్‌ఈ పి.రామకృష్ణారెడ్డి డీఈఈ ఆన్యం రాంబాబు పాల్గొన్నారు.
ఇసుక తవ్వకాలపై తనిఖీలు
జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. ఇసుక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో రోడ్లు, భవన నిర్మాణ రంగాల డిమాండ్‌కు అనుగుణంగా ఇసుకను సరఫరా చేయాలన్నారు. అనధికారంగా గోదావరి నదిలో ఇసుక తవ్వకాలు చేపడుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు. విశాఖపట్నం జిల్లాలో భవన నిర్మాణాలకు పొడగట్లపల్లి ఇసుక రీచ్‌ను కేటాయించామన్నారు. జిల్లా భూగర్భ గనుల శాఖ అధికారి ఎల్.వంశీధర్ రెడ్డి, జిల్లా రవాణా అధికారి డి.శ్రీనివాసరావు. కాలుష్య నియంత్రణ మండలి కార్యనిర్వాహక ఇంజినీర్ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment