
బస్సులో సూట్ కేసు చోరీ
తస్కరించిన మహిళ నుంచి 117 గ్రాముల బంగారు నగల రికవరీ
అమలాపురం టౌన్: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న దంపతులకు చెందిన బంగారు నగలతో ఉన్న సూట్ కేసును వారితో ప్రయాణించిన ఓ మహిళ కాజేసిన కేసును అమలాపురం పట్టణ పోలీసులు ఛేదించారు. దాదాపు రూ.6 లక్షల విలువైన 117 గ్రాముల బంగారు నగలను ఆ మహిళ నుంచి రికవరీ చేయడంతోపాటు ఆమెను మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. ఈ కేసు వివరాలను ఆయన వివరించారు. గత నెల 17వ తేదీన విశాఖపట్నం జిల్లా కూర్మన్నపాలేనికి చెందిన దుర్గమ రామకృష్ణ దంపతులు కాకినాడ ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో అమలాపురం నాన్ స్టాప్ బస్సు ఎక్కారు. బస్సులో రామకృష్ణ భార్య పక్కనే ఓ మహిళ కూర్చుంది. బస్సులో కాళ్ల దగ్గర బంగారు నగలతో ఉన్న సూట్ కేసును ఆ దంపతులు పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. ఆ మహిళ ముమ్మిడివరంలో దిగిపోయింది. రామకృష్ణ దంపతులు అమలాపురంలోని తమ బంధువులు ఇంటికి వెళ్లిన తర్వాత బస్సులో సూట్ కేసు పోయినట్లు గుర్తించారు. ఆ సూట్ కేసులో ఒక బంగారు తెల్ల రాళ్ల నక్లెస్, ఎరుపు ఆకుపచ్చ రాళ్ల బంగారు నక్లస్, బంగారపు ఆకు పచ్చ రాళ్ల నక్లెస్, రెండు బంగారపు లాకెట్లు మొత్తం 117 గ్రాముల బంగారు నగలు ఉన్నట్లు అదే రోజు పట్టణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రామకృష్ణ పేర్కొన్నారు. బస్సులో తన భార్య చెంతన కూర్చున్న మహిళపైనే తమకు అనుమానం ఉందని ఆ ఫిర్యాదులో రాశారు. ఈ కేసును డీఎస్సీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్ ఆధ్వర్యంలో సీఐ వీరబాబు, క్రైమ్ ఎం.గజేంద్రకుమార్ పర్యవేక్షణలో పట్టణ ఎస్సై ఎస్‌ఆర్ కిషోర్‌బాబు, క్రైమ్ సిబ్బంది లోతుగా దర్యాప్తు చేశారు. ఆ రోజు బస్సులో బంగారు నగలతో ఉన్న సూట్ కేసును గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం ఎర్ర చెరువు గ్రామానికి చెందిన ఆవుల యశోద దొంగిలించినట్లు తమ దర్యాప్తులో పోలీసులు గర్తించారు. అమలాపురం ఆర్టీసీ బస్సు స్టేషన్‌లో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న యశోదను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి 117 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. దొంగను రెండు వారాల్లో అరెస్ట్ చేయడమే కాకుండా నూరు శాతం సొత్తును రికవరీ చేసిన సీఐలు వీరబాబు, గజేంద్రకుమార్, ఎస్సై కిషోర్‌బాబు, క్రైమ్ సిబ్బందిని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ చోరీలో మహిళా దొంగ యశోదకు సహకరించిన మరో నిందితురాలిని అరెస్ట్ చేయాల్సి ఉందని సీఐ వీరబాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment