ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): బోటులో అనధికారికంగా తీసుకువెళ్లి మళ్లీ సోమవారం రాత్రి తిరిగి వస్తుండగా బోటు తిరగబడి ఇద్దరు మృతిచెందిన ఘటనపై త్రీటౌన్ పోలీసులు సుబ్బారావుపేటకు చెందిన బెజవాడ సత్తిబాబు ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం సుబ్బారావుపేటకు చెందిన బెజవాడసత్తిబాబు, సింహాచలనగర్‌కు చెందిన చవల అన్నవరం(54), కాతేరు మిలటరీకాలనీకి చెందిన గాడారాజు(24), కోట రాంబాబు, భవానీపురానికి చెందిన మరికొందరుతో కలిసి కోటిలింగాలరేవు నుంచి సోమవారం మధ్యాహ్నం బోటులో బ్రిడ్జిలంక బయలుదేరారు. బోటులో వెళ్తుండగా లోపలికి నీరు వస్తుండడంతో సత్తిబాబు, మరికొందరు కేకలు వేశారు. బోటు రైడర్ మల్లయ్యపేటకు చెందిన మల్లాది సుబ్రహ్మణ్యం, బోటుషికారు కోసం రూ.100 వసూలు చేసిన ఇసుకపల్లి ధనరాజు ఏమీ జరగదని, బోటులో నీటిని తోడేస్తే ఏమీ కాదని భరోసా ఇచ్చారు. చివరకు బ్రిడ్జిలంకకు చేరుకున్నారు. తిరిగి రాత్రి 7.30 గంటల సమయంలో బోటురైడర్, హెల్పర్, మరో పదిమంది బోటులో పుష్కరఘాట్‌కు బయలుదేరారు. బోటు రైల్వే బ్రిడ్జి 7 – 8 పిల్లర్ల మధ్యలోకి రాగానే ఒక్కసారిగా బోటులోకి నీరు చేరింది. దీంతో బోటు గోదావరి నదిలో కూరుకుపోయింది. ఇంతలో చవల అన్నవరం, గాడా రాజులకు ఈత రాకపోవడంతో గోదావరి నదిలో గల్లంతయ్యారు. కానీ, బెజవాడ సత్తిబాబు ఆ స్థలం నుంచి ఈత కొట్టి సమీపంలోని పాత హావ్ లాక్ బ్రిడ్జి పిల్లర్లను పట్టుకున్నారు. వారి కేకలు విన్న సమీపంలోని మత్స్యకారులు వారిని సురక్షితంగా పుష్కరఘాట్‌కు తరలించారు. బెజవాడ సత్తిబాబు, ఇతరులు వారికి తెలిసినవారికి సమాచారం ఇవ్వడంతో పోలీసులు, అగ్నిమాపక, రెవెన్యూ అధికారులు పుష్కరాలరేవుకు చేరుకుని గోదావరిలో పడవలతో గాలించగా చవల అన్నవరం, గాడా రాజు మృతదేహాలు లభ్యమయ్యాయి. గోదావరి నదిలో బోటు నడిపిన బోటు రైడర్‌తో కలిసి ప్రయాణం కోసం డబ్బులు వసూలు చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని, ఎలాంటి అనుమతులు లేకుండా పడవలో గోదావరిలో అమాయకులను తరలించిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని బెజవాడ సత్తిబాబు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment