సిండికేటు గనికట్టు..!
జియో కోట్స్
బండారం బట్టబయలు
ఇసుక తవ్వకాలు చేసిన ర్యాంపులలో మైనింగ్ అధికారులు జియో కో ఆర్డినేట్స్ ద్వారా పరిశీలిస్తే ర్యాంపులలో ఇసుక తవ్వకాలపై కచ్చితమైన లెక్కలు వస్తాయి. కాని అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. రాజకీయ వత్తిడులకు తలొగ్గుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడున్నవారికే ర్యాంపులు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కొత్తవారు వస్తే ఇప్పటి వరకు జరిగిన అక్రమ తవ్వకాలు బయటకు వస్తాయని వారు భయపడుతున్నారు. జూలై నెల వరకు ర్యాంపులను పాతవారి చేతులలో ఉంచితే గోదావరికి వరదలు వస్తాయి. ర్యాంపుల వద్ద కొత్త ఇసుక మేటు వేయడం వల్ల పాత తవ్వకాల ఆనవాళ్లు కూడా కనపడవు. వరదలతో లంక గ్రామాల్లో పంటలతోపాటు ఇసుక అక్రమాలు కూడా కొట్టుకుపోతాయి.
సాక్షి, అమలాపురం/రావులపాలెం: అధికారిక ఇసుక ర్యాంపుల్లో జరుగుతున్న తవ్వకాలకు.. మైనింగ్ అధికారులు చెబుతున్న లెక్కలకు పొంతన లేకుండా పోతోంది. మూడు లోడులు అధికారికంగా చూపితే.. దొడ్డిదారిన ఆరు లోడులు తరలిపోతున్నాయి. కూటమి నేతల కనుసన్నలలో సిండికేట్ అవతారం ఎత్తిన కాంట్రాక్ట్ కంపెనీలు దొడ్డిదారిన తవ్వకాలతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాయి. ఇప్పుడు తవ్వకాలకు సమయం సరిపోలేదని, గడువు పెంచాలని కోరుతూ మరోసారి ఆదాయానికి గండి కొట్టేందుకు సిద్ధమవుతోంది.
జిల్లాలో ఉన్న 15 ఇసుక ర్యాంపులలో రెండింటికి ఈ ఏడాది నవంబరు వరకు కాలపరిమితి ఉంది. మిగిలిన 13 ర్యాంపులలో ఏడింటికి మంగళవారంతో గడువు పూర్తికాగా, మిగిలిన ఆరింటికి ఈ నెల 14తో గడువు ముగియనుంది. ఆయా ర్యాంపులకు ప్రభుత్వం ఇసుక తవ్వకాలకు ఇచ్చిన అనుమతిలో సగం కూడా తవ్వకాలు చేయనట్టు మైనింగ్ అధికారులు చెబుతున్నారు. ఈ ర్యాంపులలో గత నవంబరు 8వ తేదీ నుంచి తవ్వకాలు మొదలయ్యాయి. మొత్తం 7,99,800 మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలకు అనుమతి ఇస్తే ఇంత వరకు 4,35,835 టన్నుల ఇసుక తవ్వారు. ఇంకా 3,63,965 టన్నుల ఇసుక తవ్వాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించారు. అయితే వాస్తవంగా అధికారులు చెప్తున్న దాని కన్నా రెండు రెట్లు అదనంగా ఇసుక తవ్వినట్టు అంచనా. ఇప్పుడు తవ్వకాలు పెద్దగా చేయలేదని చెబుతున్న వద్దిపర్రు–1తో పాటు అంకంపాలెం, నార్కెడ్‌మిల్లి, పులిదిండి, ఆత్రేయపురం, రావులపాలెం మండలం ఊబలంక, పొడగట్లపల్లి, కపిలేశ్వరపురం, ఆలమూరు, తాతపూడి తదితర ర్యాంపులలో నిబంధనలకు విరుద్ధంగా జేసీబీలతో ఇసుక తవ్వకాలు చేయడం గమనార్హం. పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుక లోడుతో లారీలు తిరుగుతూనే ఉన్నాయి.
సిండి‘కాటు’
కొన్ని ర్యాంపులలో తవ్వకాలు తక్కువగా జరగడానికి ర్యాంపులు పొందిన పాటదారులు సిండికేట్‌గా మారడం ప్రధాన కారణం. ఇసుక ర్యాంపులు కేవలం కొత్తపేట, మండపేట నియోజకవర్గాలలో మాత్రమే ఉన్నాయి. ఇక్కడ కీలక నేతలకు ర్యాంపులలో వాటాలు ఉండడంతో సిండికేట్‌ను ఒక మాట మీదనే ఉంచారు. అడ్డం వచ్చిన కాంట్రాక్టు సంస్థలను ముందుగానే తరిమివేశారు. వద్దిపర్రు–2, పొడగట్లపల్లి, ఆలమూరు వంటి ర్యాంపులలో తక్కువగా ఇసుక తవ్వకాలు జరగడానికి కారణం ఇసుకకు కృత్రిమ కొరత సృష్టించి సొమ్ములు చేసుకోవడమే. ఈ విషయాన్ని గత ఏడాది నవంబరులో ఇసుక పాటల సమయంలోనే ఆ నెల 8వ తేదీన ‘సిండికేటు పాట రూ.16 కోట్లు’ శీర్షికన ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. అందుకు తగినట్టుగానే కొన్ని ర్యాంపుల్లో తవ్వకాలు చేయడం, మరికొన్ని ర్యాంపుల్లో తవ్వకాలు మందకొడిగా సాగాయి. ఇప్పుడు తవ్వకాలు పెద్ద ఎత్తున జరిగిన చోట, జరగని చోట కూడా గడువు పెంచాలని కోరుతూ ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా సొమ్ములు చేసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలో ర్యాంపులు.. వాటిలో ఇసుక తవ్వకాలు... స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక నిల్వలు ఇలా.. (ఈ నెల నాలుగో తేదీ సాయంత్రం వరకు) (మెట్రిక్ టన్నులలో)
లెక్కల్లో మూడు..
దొడ్డిదారిన ఆరు లారీలతో తరలింపు
నిబంధనలకు విరుద్ధంగా
జేసీబీలతో తవ్వకాలు
అక్కడ నుంచి నేరుగా తరలింపు
తక్కువ తవ్వకంగా చూపే యత్నం
సహకరిస్తున్న అధికార యంత్రాంగం
సిండికేటుగా మారి ఇసుక దోపిడీ
ఇంకా తవ్వాల్సి ఉందని నివేదిక
అనుమతి రాగానే
మరోసారి దోచుకునే యత్నం
ర్యాంపు అనుమతి తవ్వినిది ప్రస్తుత నిల్వ తవ్వాల్సింది
పులిదిండి 33,750 31,755 12,296 1,995
ఆత్రేయపురం 71,100 52,484 12,290 18,616
ఊబలంక 64,480 48,482 11,140 16,318
వద్దిపర్రు–1 63,300 15,132 3,255 48,168
పొడగట్లపల్లి–1 54,900 51,816 17,265 3,084
అంకంపాలెం 72,750 36,200 15,412 36,550
నార్కెడిమిల్లి 31,500 29,240 19,983 2,260
కపిలేశ్వరపురం 65,850 52,364 14,965 13,486
ఆలమూరు 68,400 26,854 14,329 41,546
తాతపూడి 67,500 30,648 24,316 36,852
గోపాలపురం 74,700 51,140 23,470 23,560
పొడగట్లపల్లి–2 60,000 9,720 5,740 50,280
వద్దిపర్రు–2 71,250 0 0 71,250
మొత్తం 7,99,800 4,35,835 1,74,461 3,63,965
సిండికేటు గనికట్టు..!
Comments
Please login to add a commentAdd a comment