కోనసీమ కోకో సంఘం ఏర్పాటుకు యోచన
అమలాపురం రూరల్: జిల్లాను కోకో హబ్‌గా తీర్చిదిద్దేందుకు నాంది పలుకుతూ కోనసీమ కోకో సంఘం ఏర్పాటుకు యోచిస్తున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో ఉద్యాన, సహకార రిజిస్ట్రార్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి ఈ ఏర్పాటుకు విధివిధానాలపై చర్చించారు. ఈ సంఘానికి అధ్యక్షురాలిగా జేసీ, ఉపాధ్యక్షులుగా జిల్లా ఉద్యాన అధికారి, సభ్యులుగా జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి, మరొక సభ్యుడిగా జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్, జిల్లా సహకార అధికారి, జిల్లా రిజిస్ట్రార్, రైతు ఉత్పత్తిదారుల సంఘాల నుంచి అడ్డాల గోపాలకృష్ణ, సరేళ అప్పారావులను నియమించనున్నట్టు తెలిపారు. సంఘ రిజిస్ట్రేషన్ ఏర్పాట్లు ప్రారంభించాలని అధికారుల ఆదేశించారు. క్లస్టర్ వారీగా కోకో పంటల విస్తరణకు జిల్లాలో ప్రాథమిక దశలో వెయ్యి ఎకరాలను గుర్తిస్తూ లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించారు. జిల్లాలో లక్ష ఎకరాల విస్తీర్ణంలో కొబ్బరి తోటలు ఉన్నాయని, వీటిలో 50 శాతం పాక్షిక నీడలో కోకో సాగుకు అనువైన ప్రాంతాలను ఎంపిక చేయాలని సూచించారు. రాజోలు మలికిపురం, సఖినేటిపల్లి మండలాలో ఉప్పునీటి ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉన్న ఈ సాగుకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రిజిస్ట్రార్ నాగలింగేశ్వర రావు, జిల్లా సహకార అధికారి ఎస్.మురళీకృష్ణ, జిల్లా ఉద్యాన అధికారి బీవీ రమణ పాల్గొన్నారు.
పాఠశాలల పునర్విభజన నిర్వహించాలి
పాఠశాల విద్య బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పాఠశాలల పునర్విభజన చర్యలను పాఠశాల నిర్వహణ కమిటీలు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో వివరించి కమిటీల ఆమోదంతో ఈ ప్రక్రియను నిర్వహించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి పాఠశాలల పునర్విభజనపై సమీక్షించారు. ప్రభుత్వం పాఠశాలల పునర్నిర్మాణం, బోధనా సిబ్బంది పునర్విభజనపై దృష్టి పెట్టిందన్నారు. జేసీ టి.నిశాంతి, జిల్లా విద్యాశాఖ అధికారి సలీమ్ బాషా తదితరులు పాల్గొన్నారు.
మానవ వనరుల లభ్యతపై..
జిల్లాలో వివిధ శాఖల్లో కార్యకలాపాలకు సంబంధించి మానవ వనరుల లభ్యత శిక్షణ కార్యక్రమాలపై జిల్లాస్థాయి అధికారులు నివేదికలు సమర్పించాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నైపుణ్య అభివృద్ధి శాఖ జిల్లా కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వివిధ శాఖలలో మానవ వనరుల వినియోగం, వాటికి అవసరమైన శిక్షణలను నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా ఇప్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి నైపుణ్యాభివృద్ధి విభాగానికి సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. మార్చి 19 నాటికి ఆయా శాఖలు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి హరి శేషు, జిల్లా విద్యాశాఖ అధికారి వసంత లక్ష్మి, డీఆర్‌డీఏ పీడీ శివ శంకర్ ప్రసాద్ జిల్లా వ్యవసాయ అధికారి బోసుబాబు, ఉద్యాన అధికారి దిలీప్ పరిశ్రమల కేంద్రం సహాయ సంచాలకుడు శివరాం ప్రసాద్ పాల్గొన్నారు.
మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
ఈనెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జిల్లాస్థాయిలో అధికారులు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. బుధవారం సంబంధిత మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సూర్యకుమారి అమరావతి నుంచి వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించి ఆదేశించినట్టు తెలిపారు. జేసీ టి.నిశాంతి మాట్లాడుతూ మహిళా సాధికారతకు అమలు చేస్తున్న పథకాలపై నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. డీఆర్‌డీఏ పీడీ శివశంకర ప్రసాద్, ఎల్‌డీఎం కేశవ వర్మ, జిల్లా పరిశ్రమల కేంద్రం సహాయ సంచాలకుడు శివరాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ మహేష్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment