
రత్నగిరి సీఆర్వో కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణ
అన్నవరం: రత్నగిరి గదుల రిజర్వేషన్ కార్యాలయ (సీఆర్వో) సిబ్బంది నిర్లక్ష్యంపై ఈఓ వీర్ల సుబ్బారావు విచారణకు ఆదేశించారు. దీనికి భాద్యులుగా భావిస్తూ సీఆర్వో కార్యాలయం సీనియర్ అసిస్టెంట్‌కు షోకాజ్ నోటీసు, ఆ కార్యాలయంలో కౌంటర్ క్లర్క్‌లుగా పనిచేస్తున్న ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులను సస్పెండ్ చేయడానికి అధికారులు ఫైల్ సిద్ధం చేసినట్టు సమాచారం.
హరిహరసదన్ పక్కన గల స్థలం ఈ నెల 22న వివాహానికి అద్దెకి తీసుకున్న పెళ్లిబృందం వివాహం అనంతరం ఆ స్థలం ఖాళీ చేసినప్పటికీ సిబ్బంది పది రోజుల వరకు కంప్యూటర్‌లో చెకౌట్ చేయకపోవడంతో పది రోజులు అద్దెకిచ్చినట్లు నమోదైంది. ఈ స్థలం ఒక రోజు అద్దె రూ. 29 వేలు కాగా, పది రోజులకు రూ.2.90 లక్షలు చెల్లించాలని కంప్యూటర్‌లో నమోదైంది. సాధారణంగా దేవస్థానంలో సత్రం గదులు అద్దెకిచ్చిన 24 గంటల తరువాత చెకౌట్ అవ్వకపోతే ఆటోమేటిక్‌గా మరుసటి రోజు అద్దె కూడా కంప్యూటర్ లో నమోదయిపోతుంది. అందువల్ల ఆ సిబ్బంది గదులు అద్దెకు తీసుకున్న భక్తులకు ఈ విషయం చెబుతారు. కాని వివాహాలు చేసుకునే స్థలాల విషయంలో మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో ఈ విధమైన పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కలెక్టర్ తనిఖీ తరువాత
పట్టించుకున్న వారు లేరు
గత నెల 24వ తేదీన కలెక్టర్ షణ్మోహన్ రత్నగిరి తనిఖీలలో భాగంగా గదులు అద్దెకిచ్చే కార్యాలయాన్ని తనిఖీ చేసి గదులు ఖాళీ ఉన్నా భక్తులకు అద్దెకివ్వని పరిస్థితి గమనించి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే. ఇది జరిగి పది రోజులైనా ఈ విభాగంలో తనిఖీ చేసిన నాథుడు లేడు. సిబ్బంది పనితీరు మారిందా లేదా అని పట్టించుకున్నవారు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతీ రోజు ఎన్ని గదులు అద్దె కిచ్చారు. ఎన్ని ఖాళీ ఉన్నాయి...అద్దె కిచ్చిన గదులకు సమానంగా అద్దె దేవస్థానానికి జమ అయిందా లేదా అని ఆరా తీసి ఉంటే ఈ వివాహ స్థలం చెకౌట్ విషయం కూడా తెలిసేదనే అభిప్రాయం వినిపిస్తోంది. కేవలం ఆఫీసులో సిబ్బందితో గంటల తరబడి సమావేశాల వలన పెద్దగా ప్రయోజనం ఉండదని అంటున్నారు.
సీనియర్ అసిస్టెంట్‌కి
షోకాజ్ నోటీసు
ఇద్దరు కాంట్రాక్ట్ సిబ్బంది
సస్పెన్షన్‌కు రంగం సిద్ధం
Comments
Please login to add a commentAdd a comment