
న్యాయ సేవాధికార కమిటీకి మధ్యవర్తుల నియామకం
అమలాపురం టౌన్: అమలాపురం న్యాయ సేవాధికార కమిటీకి మధ్యవర్తులుగా ముగ్గురిని నియమిస్తూ ఆ కమిటీ చైర్మన్, రెండో అదనపు కోర్టు జిల్లా న్యాయమూర్తి వి.నరేష్ ఉత్తర్వులు జారీ చేశారు. విశ్రాంత స్పెషల్ మెజిస్ట్రేట్ ఎం.రామభద్రరావు, సీనియర్ న్యాయవాది, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ వీకేఎస్ భాస్కరశాస్త్రి, మరో సీనియర్ న్యాయవాది కేవీవీ శ్రీనివాసరావులు మధ్యవర్తులుగా నియమితులయ్యారు. జిల్లా ప్రధాన మండల న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు గతంలో ఈ ముగ్గురూ రాజమహేంద్రవరం జిల్లా ప్రధాన కోర్టులో 40 గంటల పాటు మధ్యవర్తిత్వంపై శిక్షణ పొందారు. ఇప్పడు ఈ ముగ్గురిని మధ్యవర్తులుగా నియమించారు.
పీఎం ఇంటర్న్‌షిప్ కోసం
రిజిస్ట్రేషన్లు
అమలాపురం రూరల్: భవన, ఇతర నిర్మాణ, అసంఘటిత రంగ కార్మికులకు చెందిన 21–24 మధ్య వయస్సు గల పిల్లలకు పీఎం ఇంటర్న్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టాలని కోనసీమ జిల్లా ఉప కార్మిక కమిషనర్ టి.నాగలక్ష్మి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భవన నిర్మాణ, ఆసంఘటిత రంగ కార్మికుల పిల్లలు, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అభ్యర్థులు ఐటీఐ నుంచి సర్టిఫికెట్, పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్ నుంచి డిప్లొమా, బీఏ, బీఎస్సీ, బీకాం, బీసీఏ, బీబీఏ, బీ ఫార్మ్ వంటి డిగ్రీ కలిగి ఉండాలన్నారు. ఆన్‌లైన్, దూర విద్య ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. మార్చి 12 వరకు గడువు ఉందని తెలిపారు.
డీఎస్సీ ఆన్‌లైన్ శిక్షణకు
దరఖాస్తులు
అమలాపురం రూరల్: అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని బీసీ, ఈబీసీ కులాలకు చెందిన అభ్యర్థులకు ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో డీఎస్సీ–2024 పరీక్షలకు ఉచిత ఆన్‌లైన్ శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం అమలాపురంలో కోనసీమ జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసు కోవాలని సంబంధిత అధికారి పి. సత్య రమేష్ కోరారు. అభ్యర్థులు ఏపీ టెట్‌లో అర్హత సాధించి ఉండాలన్నారు. ఏపీ టెట్‌లో అత్యధిక మార్కులు పొందిన అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. అభ్యర్థులు తమ బయోడేటా 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీఈడీ, టీటీసీ, టెట్ మార్కుల జాబితా, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్, బ్యాంకు పాస్ పుస్తకం, రెండు పాస్ పోర్ట్ సైజు ఫొటోలతో ఈ నెల పదో తేదీ నుంచి అమలాపురంలో కోనసీమ జిల్లా బీసీ సంక్షేమ సాధికరత అధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు. వివరాలకు 9398973754, 9440403629 సెల్ నంబర్లను సంప్రదించాలన్నారు.
‘ఇంటర్’ మూల్యాంకనం ప్రారంభం
● అప్రమత్తంగా నిర్వహించాలని
సిబ్బందికి డీఐఈవో సూచన
అమలాపురం టౌన్: అమలాపురంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఇంటర్ ప్రధమ, ద్వితీయ సంవత్సరాల సంస్కృతం జవాబు పత్రాలను దిద్దే ఏర్పాట్లు జరిగాయి. ప్రధమ సంవత్సరం 5,540, ద్వితీయ సంవత్సరం 4,929 జవాబు పత్రాలను ఇక్కడ దిద్దాల్సి ఉందని డీఐఈవో వనుము సోమశేఖరరావు తెలిపారు. అంతకు ముందు నిర్వహించిన సమావేశంలో మూల్యాంకనాన్ని అత్యంత అప్రమత్తంగా నిర్వహించాలని ఆయన సూచించారు. ఈనెల 17వ తేదీ నుంచి ఇంగ్లిషు, తెలుగు, హిందీ, గణితం, పౌర శాస్త్రం, 22 నుంచి రసాయనశాస్త్రం, చరిత్ర, 26 నుంచి వృక్షశాస్త్రం, జంతు శాస్త్రం, వాణిజ్య శాస్త్రం జవాబు పత్రాల మూల్యాంకనాలు మొదలవుతాయని చెప్పారు.
543 మంది విద్యార్ధులు పరీక్షలకు గైర్హాజరు
జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం జనరల్, ఒకేషనల్ పరీక్షలకు 543 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్ ఇంటర్ పరీక్షలకు మొత్తం 10,379 మంది విద్యార్థులకు 10 వేల మంది విద్యార్ధులు హాజరుకాగా 379 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ పరీక్షలలో 2456 మంది విద్యార్థులకు 2,292 మంది హాజరు కాగా, 164 మంది గైర్హాజరయ్యారని డీఐఈవో తెలిపారు. పామర్రులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, రామచంద్రపురం ప్రభుత్వ, మోడరన్, వికాస్ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటైన పరీక్షా కేంద్రాలను ఆయన తనిఖీలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment