
12న యువత పోరు బాటకు తరలిరండి
వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీలు
అమలాపురం రూరల్: వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 12వ తేదీన యువత పోరు బాట పేరిట కలెక్టరేట్ వద్ద జరిగే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్ పిలుపునిచ్చారు. అమలాపురం మండలం భట్నవెల్లిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ స్వగృహం వద్ద ఆదివారం వైఎస్సార్ సీపీ యువత పోరు బాట పేరిట వాల్ పోస్టర్లను ఎమ్మెల్సీలు ఆవిష్కరించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు సంసాని వెంకట చంద్రశేఖర్(నాని) అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీలు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలైనా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.వెయ్యి కోట్లు విడుదల చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. దీనివల్ల పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని, అప్పు చేసి, ఫీజులు కడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఫీజు బకాయిలు కట్టకపోతే పరీక్షలకు అనుమతించడం లేదన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి మూడు నెలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ తల్లుల బ్యాంక్ ఖాతాల్లో వేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం లక్షలాది మంది విదార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజు బకాయిలు ఇచ్చే వరకూ వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందన్నారు. జిల్లాలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యువత పోరు బాటకు తరలిరావాలని పిలుపునిచ్చారు. పార్టీ రామచంద్రపురం, పి.గన్నవరం నియోజకవర్గాల ఇన్‌చార్జీలు పిల్లి సూర్యప్రకాశ్, గన్నవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసగిస్తోందని దుయ్యబట్టారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, ఎంపీపీ కుడిపూడి భాగ్యలక్ష్మి, పార్టీ నేతలు కోనుకు బాపూజీ, జున్నూరి వెంకటేశ్వరరావు, తోరం గౌతమ్, జాన్ గణేష్, వంటెద్దు వెంకన్నాయుడు, కుడుపూడి భరత్‌భూషణ్, వాసంశెట్టి తాతాజీ, కుంచె రమణారావు, చింతా రామకృష్ణ, దంగేటి రుద్ర, కౌన్సిలర్లు చిట్టూరి పెదబాబు, బండారుల గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment